వివేకా హత్య కేసులో భాస్కర్‌ రెడ్డికి నోటీసులు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్‌ భాస్కర్‌ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులిచ్చింది. వివేకా హత్య కేసులో వైఎస్‌ భాస్కర్‌రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని సిబిఐ దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. ఒకసారి బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేసిన న్యాయమూర్తి ఇప్పుడు బెయిల్‌ మంజూరు చేశారని సిబిఐ తరపున న్యాయవాది అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ (ఎఎస్‌జి) రాజ్‌ ఠాక్రే తెలిపారు. ఇదే కేసులో మిగిలిన నిందితులకు కూడా బెయిల్‌ రద్దు చేయాలని దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులోనే విచారణ జరుగుతోందని ధర్మాసనం దృష్టికి సునీత తరపున న్యాయవాది జెఎస్‌ఎల్‌ వాహీ తీసుకొచ్చారు. ఆ పిటిషన్లతోనే భాస్కర్‌రెడ్డి బెయిల్‌ రద్దు పిటిషన్‌ను కూడా జత చేయాలని కోరారు. దీంతో భాస్కర్‌రెడ్డికి ధర్మాసనం నోటీసులు జారీ చేసి, మిగిలిన పిటిషన్లకు ఈ పిటిషన్‌ను జత చేయాలని ఆదేశించింది. అనంతరం విచారణను వాయిదా వేసింది.

➡️