ప్రజాశక్తి – గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరులోని మస్తాన్ దర్గా స్వాధీనానికి జిల్లా వక్ఫ్ బోర్డు అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు దర్గా ధర్మకర్త రావి రామోహనరావుకు మంగళవారం నోటీసులు జారీ చేశారు. బుధవారం దర్గాను స్వాధీనం చేసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు. ముస్లిములు నిర్వహించాల్సిన దర్గాను హిందువులు నిర్వహించడాన్ని ఇటీవల జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే తప్పుపట్టినట్టు తెలిసింది. ధర్మకర్త రావి రామ్మోనరావు కుమారుడు మస్తాన్ సాయి హైదరాబాద్‌లో వందలాది మంది యువతులను అశ్లీలంగా వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసిన కేసుల్లో అరెస్టు అయిన నేపథ్యంలో గుంటూరుకు చెందిన పలువురు దర్గా నిర్వహణపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. రామ్మోహనరావు అక్రమ సంపాదన వల్లే ఆయన కుమారుడు మస్తాన్ సాయి విచ్చలవిడిగా ప్రవరిస్తున్నారని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. దర్గా అంశంపై కలెక్టర్ విచారణకు ఆదేశించడంతో దర్గా స్వాధీనం కోసం వక్ఫ్ బోర్డు అధికారులు నోటీసులు జారీ చేశారు. తన తండ్రి హయాం నుంచి దర్గాను తామే నిర్వహిస్తున్నామని, కొంతమంది కావాలని ఫిర్యాదు చేసి స్వాధీనం కోసం తమపై ఒత్తిడి తెస్తున్నారని దర్గా ధర్మకర్త రామ్మోహనరావు తెలిపారు. శ్రీ హజరత్ కాలే మస్తాన్ షా ఔలియా సంరక్షణ బాధ్యతలు తమ పూర్వీకుల నుండి నిర్వహిస్తున్నామని చెప్పారు. దర్గా వక్ఫ్ పరిధిలోకి రాదని, 1892లోనే మద్రాస్ కోర్టు తీర్పు ఇచ్చిందని చెప్పారు. 2000 సంవత్సరంలో గుంటూరు జిల్లా కోర్టు తన జడ్జిమెంట్‌లో మస్తాన్ దర్గా వక్ఫ్ పరిధిలోకి రాదని చెప్పినట్లు ఆయన వెల్లడించారు. ఇప్పుడు ఏ విధంగా వక్ఫ్ బోర్టు సభ్యులు దర్గాను స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారో అర్థం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వక్ఫ్ బోర్డుకు సంబంధం లేకపోతే 2020 వరకు వక్ఫ్‌బోర్డుకు రామ్మోహనరావు రుసుము ఎలా చెల్లించారని అధికారులు ప్రశ్నించారు. దీంతో దర్గా నిర్వహణ వివాదంలో చిక్కుకుంది.
