ప్రజాశక్తి-ఒంగోలు సబర్బన్ : గత ఎన్నికల్లో నమోదైన ఐదు కేసులకు సంబంధించి వైసిపి సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి పోలీసులు బుధవారం నోటీసులు అందజేశారు. యర్రగొండపాలెంలో మూడు కేసులు, పెద్దదోర్నాలలో ఒకటి, పెద్దారవీడులో ఒక కేసు గత ఎన్నికల్లో చెవిరెడ్డిపై ఉన్నాయి. ఈ కేసులపై 41 సిఆర్‌పి నోటీసులను ఒంగోలులోని వైసిపి ప్రకాశం జిల్లా కార్యాలయంలో ఉన్న చెవిరెడ్డికి పోలీసులు అందజేశారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ నోటీసులు, అరెస్టులతో వైసిపిని ఎవ్వరూ అణచలేరన్నారు. తన మీద టిడిపి ప్రభుత్వం గతంలో 88 కేసులు పెట్టిందని గుర్తు చేశారు. ఇప్పుడు ఐదు కేసులు కాదు 50 కేసులైనా జడిసేది లేదన్నారు. తమది పోరాటాలలోంచి పుట్టిన పార్టీ అని, ఎన్ని కేసులు పెట్టినా ప్రజల వెంట ఉండి పోరాడుతామని చెప్పారు.
