ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అక్టోబరు ఒకటి నుంచి అమలులోకి రానున్న నూతన మద్యం పాలసీకి అనుగుణంగా కొత్త మద్యం షాపుల నోటిఫికేషన్ విడుదలకు రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ కసరత్తు ముమ్మరం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మద్యం షాపుల స్థానంలో 3,736 మద్యం షాపులను ప్రైవేటు వ్యక్తుల నిర్వహణలో నడిచేటట్లు కొత్త పాలసీ తయారైన విషయం తెలిసిందే. ఈ షాపుల్లో పదిశాతం షాపులను కల్లుగీత వృత్తిదారులకు రిజర్వేషన్ చేశారు. రిజర్వేషన్ల కోటాలోని మద్యం షాపులను ఎక్కడెక్కడ కేటాయించాలన్న అంశంపై రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ కసరత్తు చేస్తోంది. కల్లుగీత వృత్తి కులాల జనాభా ఏయే జిల్లాల్లో ఏ మేరకు ఉన్నారనే అంశంపై సమాచారాన్ని తెప్పించుకుంటున్నారు. కల్లుగీత వృత్తి కులాల జనాభా ప్రాతిపదికనే మద్యం షాపులను ఎక్సైజ్‌శాఖ షాపులను రిజర్వు చేయనుంది. రాష్ట్రంలో మద్యం దుకాణాలను ప్రభుత్వమే నడిపేలా గత ప్రభుత్వం చేసిన చట్టం స్థానంలో దాన్ని సవరించి ఆర్డినెన్స్ తెచ్చేందుకు రాష్ట్ర కేబినెట్ ఇటీవలే ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ ఆర్డినెన్స్ ఆమోదం కోసం సవరణ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ వద్దకు పంపనుంది. గవర్నరు నుంచి ఆమోదం రాగానే కొత్త షాపుల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు మొదలుపెట్టారు.
