నేడు కేంద్ర కరువు బృందం పర్యటన

Jan 8,2025 08:58 #Droughts

కరువును చూసేందుకు ఇప్పుడా..!
ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి : ‘దొంగలు పడ్డ ఆరు మాసాలకు…’ అన్న నానుడికి కేంద్రకరువు బృంద పర్యటన సరిగ్గా సరిపోతోంది. రబీ సీజన్‌ కూడా ముగుస్తున్న సమయంలో కేంద్ర కరువు బృందం జిల్లా పర్యటనకు రానుంది. ఈనెల ఎనిమిదవ తేదీన అనంతపురం జిల్లాలో పర్యటించనుంది. ఈ మేరకు షెడ్యుల్‌ ఖరారైనట్టు సమాచారం. 2024 ఖరీఫ్‌లో నెలకొన్న కరువును ఈ బృందం పరిశీలించనుంది. అనంతపురం రూరల్‌ మండలంలోని మన్నీల గ్రామంలోని పొలాల్లో పర్యటించి పంట పరిశీలన చేయనుంది.
అనంతపురం జిల్లాలో కరువు మండలాలను రాష్ట్ర ప్రభుత్వం 2024 అక్టోబరులో ప్రకటించింది. ఇందులో రెండు మండలాల్లో తీవ్రమైన కరువు నెలకొందని ప్రకటించింది. నార్పల, అనంతపురం రెండు మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని ప్రకటించింది. బుక్కరాయ సముద్రం, గార్లదిన్నె, రాప్తాడు, విడపనకల్లు, యాడికి ఈ ఐదు మండలాల్లో మధ్యస్థంగా కరువు ఉన్నట్టు నిర్ధారించింది. ఇందులో మొత్తం 12856 హెక్టార్లలో పంటనష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనా వేశారు. దీనికి రూ.19.98 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీ అవసరమని ప్రతిపాదించారు. ఇందులో అత్యధిక నష్టం వేరుశనగ పంటనే ఉంది. వేరుశనగ పంట నష్టానికి సంబంధించి 7796 హెక్టార్లకుగానూ రూ.13.25 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీకి ప్రతిపాదించారు. పత్తి పంట 2849 హెక్టార్లకు రూ.4.84 కోట్లు, ఆముదం 1500 హెక్టార్లకు రూ.1.27 కోట్లు, 361 హెక్టార్లలో జొన్న నష్టానికి రూ.30 లక్షలు, 20 ఎకరాల్లో పెసరకు రూ. 2 లక్షలు, 327 ఎకరాల్లో కొర్ర పంటకు రూ.27 లక్షలు ఇన్‌పుట్‌ సబ్సిడీకి ప్రతిపాదించారు.

కరువు మండలాల పున: సమీక్ష నిర్ణయం ఏమైందో ?
కరువు మండలాల ప్రకటనలో హేతుబద్దలేదని, పున:సమీక్షించాలని నవంబరులో జరిగిన జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశంలో తీర్మానించారు. అధికారపార్టీకి చెందిన నేతలే దీన్ని ముందుకు తీసుకొచ్చారు. అయితే తరువాత దీనిపై అధికారులు ఏ రకమైన చర్యలు తీసుకున్నారన్నది తెలియలేదు. కీలకమైన ఆగస్టులో వర్షాభావంతో పంటలు బాగా దెబ్బతిన్నాయని, అన్ని మండలాలను కరువు మండలాలు ప్రకటించాలని విపక్షాలు కూడా డిమాండ్‌ చేశాయి.

పర్యటన సాగునుంది ఇలా…
కేంద్ర కరువు బృందం ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం పర్యటన ముగించుకుని అనంతపురం రూరల్‌ మండలం మన్నీల గ్రామానికి వస్తుంది. అక్కడ ఆముదం పంటను అధికారులు పరిశీలిస్తారు. అనంతరం 2.30 గంటల నుంచి బయలుదేరి రాప్తాడు మండలంలోని రాప్తాడు గ్రామం చేరుకుంటారు. అక్కడ నుంచి ఐదు గంటలకు పంట పరిశీలన అనంతరం బెంగళూరుకు వెళతారు.

➡️