ఎన్‌టిఆర్‌ భరోసాగా పేరు మార్పు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక పథకం (సామాజిక భద్రత పెన్షన్‌) పేరు ఇకపై ఎన్‌టిఆర్‌ భరోసాగా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి పంచాయతీరాజ్‌శాఖ జిఓ నెంబరు 43ని శుక్రవారం విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కేటగిరీలకు పంపిణీ చేస్తున్న పింఛన్ల మొత్తం అమౌంటును ప్రభుత్వం అమాంతం పెంచింది. సామాజిక భద్రత పెన్షన్‌లు ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్లు రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచారు. పెన్షన్‌ పెంపు ఏప్రిల్‌ నుంచి అని ప్రభుత్వం పేర్కొనడంతో ఆ మూడు నెలల కాలానికి నెలకు రూ.వెయ్యి చొప్పున కలిపి జులై ఒకటిన ఒక్కొక్కరికి రూ.7 వేలు అందించనున్నారు. పింఛన్‌ పెంపు వృద్ధులు, వితంతువులు, చేనేత, కల్లుగీత కార్మికులు, చర్మకారులు మత్స్యకారులు, ఒంటరి మహిళలు, ట్రాన్స్‌జెండర్స్‌, డప్పు కళాకారులు, హెచ్‌ఐవి బాధితులు, కళాకారులకు ఈ పెంపు వర్తించనుంది. అదే విధంగా వికలాంగులకు ఇప్పటి వరకు ఇస్తున్న రూ.3 వేల పెన్షన్‌ను ఒకేసారి రూ.6 వేలకు పెంచారు. పూర్తి స్థాయిలో అస్వస్థతకు గురైన వారికి, తీవ్ర అనారోగ్యంతో మంచాన పడిన వారికి, వీల్‌ ఛైర్‌లో ఉన్నవారికి అందే రూ.5 వేల పింఛన్‌ను రూ.15 వేలకు పెంచారు. కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేసుకున్న వారికి, డయాలసిస్‌ స్టేజ్‌కు ముందున్న కిడ్నీ వ్యాధి గ్రస్తులకు పింఛన్‌ కింద ప్రస్తుతం ఇస్తున్న రూ.5 వేలను రూ.10 వేలకు పెంచారు. కుష్టు కారణంగా వైకల్యం సంభవించిన వారికి రూ.6 వేల పింఛన్‌ ప్రభుత్వం ఇవ్వనుంది.

➡️