ఎన్‌టిఆర్‌ ఫొటో విస్మరించిన టిడిపి

Jan 24,2025 10:17 #TDP ignored NTR's photos
  • పార్టీ సొంత కార్యక్రమాల్లోనూ మోడీ, పవన్‌కు ప్రాధాన్యం

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు జిల్లా టిడిపి కార్యాలయంలో మంత్రి నారా లోకేష్‌ జన్మదిన వేడుకల్లో ఏర్పాటు చేసిన ఫెక్ల్సీలు, బ్యానర్లలో పార్టీ వ్వవస్థాపకులు ఎన్‌టిఆర్‌ ఫొటోను, పేరును టిడిపి నాయకులు విస్మరించారు. ఆ ఫ్లెక్సీలో మోడీ, పవన్‌ కల్యాణ్‌ ఫొటోలు వేయడం కలకలం రేపింది. ఈ అంశం మీడియా కంట పడడంతో వారు వీడియోలు తీస్తున్నారని గ్రహించిన కార్యాలయ నిర్వాహకులు హడావుడిగా ఎన్‌టిఆర్‌ ఫొటోను ఫ్లెక్సీపై అంటించే ప్రయత్నం చేశారు. అంతేగాక పార్టీ నాయకులు మీడియాపై అసహనం వ్యక్తం చేశారు. మీడియాలో ఈ వార్త దావనంలా వ్యాపించడంతో మంగళగిరిలోని జాతీయ కార్యాలయం నాయకుల దృష్టికి ఈ విషయం వెళ్లింది. ఈ వ్యవహారంపై పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. జిల్లా నాయకులను వివరణ కోరినట్టు సమాచారం. లోకేష్‌ జన్మదిన వేడుకలు పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రావణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో జరిగాయి.

➡️