న్యూక్లియర్ పవర్‌ప్లాంట్‌కు ఎన్‌టిపిసి యోచన
ఆలోచన విరమించుకోవాలని సిపిఎం డిమాండ్
ప్రజాశక్తి – అనకాపల్లి ప్రతినిధి : అనకాపల్లి జిల్లాలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏర్పాటు ఆలోచన ఉందని ఎన్‌టిపిసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సమీర్ శర్మ విశాఖలో ఈ నెల 13న నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించడంతో జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయం కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఉందని ఆయన చెప్పడంతో భయపడుతున్నారు. ఇప్పటికే తీరప్రాంతంలో ఔషధ, రసాయన పరిశ్రమల ప్రమాదాలు, కాలుష్యంతో బాధపడుతున్న ప్రజలకు న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఆలోచన శరాఘాతంగా మారనుంది. దాదాపు రెండువేల ఎకరాల విస్తీర్ణంలో 2,800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఎన్‌టిపిసి ఉన్నట్లు సమాచారం. శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ వద్ద న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ తలపెట్టిన న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా పోరాటాలు జరుగుతుండగా అనకాపల్లి తీరంలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు ఎన్‌టిపిసి సిద్ధపడుతోంది.
థర్మల్ విద్యుత్‌కు ప్రత్యామ్నాయంగా ప్రమాద రహిత విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యత ఇవ్వాలని పర్యావరణ వేత్తలు ఒకవైపు చెబుతుండగా దానికి భిన్నంగా మరింత ప్రమాదకరమైన, ఖరీదైన న్యూక్లియర్ పవర్ ఉత్పత్తి వైపు ఎన్‌టిపిటిసి అడుగులు వేస్తోంది. జిల్లాలోని అచ్యుతాపురం మండలం పూడిమడక వద్ద 2014లో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఎపిఐఐసి) 1200 ఎకరాలను ఎన్‌టిపిసికి కేటాయించింది. నాలుగు వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్ సామర్థ్యం కలిగిన ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఎన్‌టిపిసి తొలుత భావించింది. బొగ్గు సమస్యతో పాటు పర్యావరణ సమస్యలు తీవ్రమవు తున్నాయని థర్మల్ పవర్ ప్లాంట్ బదులు పర్యావరణ సమస్యల్లేని గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటు చేయాలని 2022లో నిర్ణయించింది.
హైడ్రోజన్ ఉత్పత్తి చేయడానికి సముద్ర నీటిని ఉపయోగించేలా ప్రణాళిక రూపొందించింది. ఎన్‌టిపిసి గ్రీన్ హైడ్రోజన్ హబ్‌కు ఈ ఏడాది జనవరిలో ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. దేశంలో జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌లో భాగంగా తొలుత ఏర్పాటు చేయబోయే ఈ హబ్‌లో రూ.1.85 లక్షల కోట్ల వ్యయంతో రోజుకు 20 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యంతో 1500 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు. హరిత యూరియా, వైమానిక ఇంధనం, హరిత మిథనాల్ రోజుకు 7,500 టన్నుల ఉత్పత్తులను ఎగుమతి చేసే లక్ష్యంతో ప్రాజెక్టును రూపకల్పన చేశారు. అయితే ఈ గ్రీన్ హైడ్రోజన్ హబ్ పనులు పట్టాలెక్కకముందే న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌ను ఎన్‌టిపిసి తెరమీదకు తేవడంతో గ్రీన్ హైడ్రోజన్ హబ్‌కు కేటాయించిన భూమిని న్లూక్లియర్ పవర్ ప్లాంట్‌కు మళ్లిస్తుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రజల ప్రాణాలకే ముప్పు : సిపిఎం
అణు విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు ఆలోచనను ఎన్‌టిపిసి తక్షణమే విరమించుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం, అనకాపల్లి జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు శనివారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రమాదకరమైన అణు విద్యుత్ ప్లాంట్‌తో ప్రజల ప్రాణాలకు భద్రత లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవైపు ప్రమాద రహిత గ్రీన్ ఎనర్జీకి ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నట్లు చెబుతూనే మరోవైపు అత్యంత ప్రమాదకరమైన అణు విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు సిద్ధపడటం సరికాదని పేర్కొన్నారు. అమెరికాలోని త్రిమెన్ ఐలాండ్, రష్యాలోని చెర్నోబిల్, జపాన్‌లోని పుకూషిమాలో జరిగిన అణు ప్రమాదాల తరువాత ఆ దేశాల్లో అణు విద్యుత్ కేంద్రాలు మూసేస్తుండగా, ఇక్కడ ప్రమాదకరమైన అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయాలనుకోవడం తగదని తెలిపారు. అణు విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ప్రజా పోరాటాలతో అడ్డుకుంటామని హెచ్చరించారు.