అణు ప్లాంటు ప్రతిపాదన విరమించుకోవాలి

  • ముఖ్యమంత్రికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు లేఖ

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ప్రజల జీవనానికి, పర్యావరణానికి ముప్పు కలిగించే అణు విద్యుత్‌ ప్లాంటును అనకాపల్లిలో పెట్టాలనే ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సోమవారం లేఖ రాశారు. అణు విద్యుత్‌ ప్లాంటు కోసం అనకాపల్లి జిల్లాలో రెండువేల ఎకరాల భూమిని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం కోరినట్లు వార్తలు వస్తున్నాయని తెలిపారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనలను విరమించుకునేటట్లు చూడాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ అణు విద్యుత్‌ ప్లాంటు నిర్మాణంతో ఆంధ్ర ప్రజానీకం తీవ్రంగా ఆందోళన చెందుతున్నారని, అనకాపల్లి జిల్లాలో అణు విద్యుత్‌ ప్లాంటు నిర్మాణానికి ప్రతిపాదనలు వచ్చాయని తెలిసి ఆ ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని పేర్కొన్నారు. అణు విద్యుత్‌ ఎంత ప్రమాదకరమైనదో సిఎంగా మీకు తెలియందికాదని, అంతర్జాతీయంగా రష్యాలో చెర్నోబిల్‌, అమెరికాలో ఐస్లాండ్‌, 2011లో జపాన్‌లోని ఫుకుషిమాలో అణు ప్రమాదాల తరువాత ప్రపంచ దేశాలన్నీ అణు విద్యుత్‌ కేంద్రాల ఆలోచనలను విరమించుకున్నాయని పేర్కొన్నారు. అమెరికా తమ దేశంలో ఉన్న నాలుగు అణు విద్యుత్‌ కేంద్రాలను మూసివేసిందని, ఈ నేపథ్యంలో అనకాపల్లి జిల్లాలో న్యూక్లియర్‌ పవర్‌ ప్లాంటు నిర్మాణానికి అనుమతులుంటే ఆంధ్ర రాష్ట్ర మొత్తం పెను ప్రమాదంలోకి వెళుతుందని పేర్కొన్నారు. గాలి, నీరు, పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఈస్ట్రన్‌ నేవల్‌ కమాండ్‌, వైజాగ్‌ స్టీల్‌ప్లాంటు, హిందుస్తాన్‌ షిప్‌యార్డు, నేవల్‌ డాక్‌యార్డు, విశాఖపట్నం, గంగవరం పోర్టులు, ఎన్‌టిపిసి, బార్క్‌, ఫార్మా పరిశ్రమలు, ఎస్‌ఇజెడ్‌, ఎన్‌ఎఒబి వంటి కీలకమైన రంగాలు, పరిశ్రమలు ఉన్నాయని తెలిపారు. అణు ప్రమాదం జరిగితే క్షణాల్లో ఈ ప్రాంతం విధ్వంసం అవుతుందని, దీని తీవ్రత 80 కిలోమీటర్లు వరకూ ఉంటుందని పర్యావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారని పేర్కొన్నారు. 30 కిలోమీటర్ల పరిధిలో అణుధార్మిక ప్రభావం ఉంటుందని, ప్రజల జీవితాలపై దుర్భర ప్రభావం పడుతుందని తెలిపారు. ఇప్పటికే సముద్రతీరమంతా ఫార్మా కంపెనీలతో కలుషితమైందని, సంప్రదాయ మత్స్యకారులు తీవ్ర అన్యాయానికి గురయ్యారని వివరించారు. 1984లో భోపాల్‌లో జరిగిన గ్యాస్‌ ప్రమాదంలో వేలాదిమంది ప్రజలు దీర్ఘకాలిక వ్యాధులతో అక్కడ బాధపడుతూనే ఉన్నారని, ఈ ప్రమాద దుర్ఘటన వల్ల కలిగిన నష్టాన్ని పూడ్చుకోవాలంటే వందల సంవత్సరాలు పడుతుందని అనుభవం తెలుపుతుందని వివరించారు. 2020లో విశాఖలో ఎల్‌జి పాలిమర్స్‌ విషవాయువుల లీకేజీ ప్రమాదం ఎంత విషాదం సృష్టించిందో అరదరికీ విదితమేనని, 2024 ఆగస్టు 21న అచ్యుతాపురం ఎస్‌ఇజెడ్‌లో ఎసెన్షియా ఫార్మా ప్రమాదంలో 17 మంది మరణించి 39 మంది క్షతగాత్రులయ్యారని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు అనేకం జరుగుతున్నాయని, వీటితో పోల్చుకుంటే అణు విద్యుత్‌ తీవ్రమైన రేడియేషన్‌ కలిగి ఉంటుందని పేర్కొన్నారు. కేన్సర్‌, ఎక్యూట్‌ రేడియేషన్‌ సిండ్రోమ్‌, ఎనీమియా వంటి ప్రమాదకర వ్యాధులు వస్తాయని తెలిపారు. ఈ నేపథ్యంలో దేశ భద్రతాపరంగానూ, ప్రజల ఆరోగ్యం, జీవనోపాధి దృష్ట్యా అణు విద్యుత్‌ ప్లాంటుకు భూములు కేటాయించరాదని, విద్యుత్‌ పెంపునకు సోలార్‌, విండ్‌, పంప్డ్‌ స్టోరేజ్‌, పర్యావరణహిత గ్రీన్‌ ఎనర్జీ వంటి అనేక ప్రత్యామ్నాయ మార్గాలు ఉండగా విషతుల్యమైన అణు విద్యుత్‌ ప్లాంటుకు అనుమతులు ఇవ్వొద్దని కోరారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఈ ప్లాంటు ప్రతిపాదనను ఉపసంహరించుకునేలా చూడాలని శ్రీనివాసరావు కోరారు.

➡️