మొరాయించిన ఎన్‌విఎస్‌-02 ఉపగ్రహం

Feb 4,2025 01:00 #barked, #NVS-02, #satellite
  • పనిచేయని ఇంజిన్లు
  • నిర్దేశిత కక్ష్యలోకి చేరని శాటిలైట్‌

న్యూఢిల్లీ : కొన్ని రోజుల కిందట ప్రయోగించిన ఎన్‌వీఎస్‌-02 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. శాటిలైట్‌లోని ఇంజిన్లు ప్రజ్వరిల్లకపోవడమే ఇందుకు కారణం. భారత ఉపగ్రహ ఆధారిత నేవిగేషన్‌ వ్యవస్థలో ఎన్‌వీఎస్‌-02 ఉపగ్రహం చాలా కీలకం. దీన్ని జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ ద్వారా గత నెల 29న నింగిలోకి ప్రయోగించారు. ఇస్రోకు అది వందో ప్రయోగం. ఎన్‌వీఎస్‌-02 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు ఇస్రో తాజాగా కసరత్తు చేపట్టింది. ఇందుకోసం శాటిలైట్‌లోని ఇంజిన్లలోకి ఆక్సిడైజర్‌ను పంపి, అవి ప్రజ్వరిల్లేలా చేయాలి. అయితే ఆక్సిడైజర్‌ను ఇంజిన్లలోకి చేరవేసే వాల్వ్‌లు తెరుచుకోలేదు. దీంతో ఇంజిన్లు ప్రజ్వరిల్లలేదని ఇస్రో ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం ఈ ఉపగ్రహం.. భూఅనువర్తిత బదిలీ కక్ష్య (జీటీవో)లో పరిభ్రమిస్తోంది. ఈ కక్ష్య.. నేవిగేషన్‌ వ్యవస్థ కార్యకలాపాల నిర్వహణకు అనువైంది కాదు. ప్రత్యామ్నాయ మార్గాలను ఇస్రో పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

➡️