11న గుంటూరులో వడ్డే ఓబన్న జయంతి : మంత్రి సవిత

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రేనాటి యోధుడు వడ్డే ఓబన్న జయంతి వేడుకలను ఈ నెల 11న రాష్ట్ర స్థాయిలో, అన్ని జిల్లా కేంద్రాల్లో అధికారికంగా నిర్వహిస్తున్నట్లు బిసి సంక్షేమ శాఖ మంత్రి ఎస్‌.సవిత తెలిపారు. సచివాలయంలోని పబ్లిసిటీ సెల్‌లో గురువారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ… ప్రభుత్వం బిసిలకు పెద్దపీట వేస్తూ విశ్వకర్మ, వాల్మీకి, కనకదాస జయంతులను అధికారికంగా నిర్వహిస్తోందన్నారు. ఇదే తీరులో స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతిని ఈ నెల 11న రాష్ట్ర స్థాయిలో గుంటూరు నగరంలోని ఎ1 కన్వెన్షన్‌ హాలులో, అన్ని జిల్లా కేంద్రాల్లోను ఘనంగా నిర్వహించేందుకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. ఇడబ్ల్యూఎస్‌లో ఉన్న బిపిఎల్‌ కుటుంబాలను అభివృద్ధి చేయడానికి యాక్షన్‌ ప్లాన్‌ రూపొందిస్తున్నట్లు తెలిపారు. బ్రాహ్మణ క్రెడిట్‌ కోపరేటివ్‌ సొసైటీ తరహాలో వీరికి సొసైటి ఏర్పాటు చేసి వ్యక్తిగత, గ్రూపు రుణాలు అందించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఎపి ఆర్యవైశ్య, రెడ్డి, కమ్మ కోపరేటివ్‌ సొసైటీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

➡️