- వామపక్ష పార్టీల ప్రకటన
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : గాజాపై ఇజ్రాయిల్ ఆటవిక దాడులు, యుద్ధాన్ని ఆపాలని, కాల్పుల విరమణ జరిపి ఘర్షణలకు స్వస్తి పలకాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 7న విజయవాడలోని బాలోత్సవ భవన్‌లో ఉదయం పదిగంటలకు సంఘీభావ సదస్సు జరగనుంది. ఈ మేరకు వామపక్ష పార్టీలు ఒక ప్రకటన విడుదల చేశాయి. పది వామపక్ష పార్టీలు జాతీయ స్థాయిలో ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమం జరగనుంది. గత ఏడాది అక్టోబర్ 7న హమాస్ దాడికి ప్రతీకార దాడి పేరుతో ఇజ్రాయెల్ పాలస్తీనాపై విచక్షణారహితంగా క్రూరమైన దాడులకు దిగిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి ఇప్పటివరకు ఇజ్రాయిల్ దాడుల కారణంగా 42 వేల మందికి పైగా పాలస్తీనా ప్రజలు మరణించారని వామపక్షాలు తెలిపాయి. వీరిలో మహిళలు, చిన్నారులు ఎక్కువగా ఉన్నారని పేర్కొన్నాయి. వాస్తవానికి మరణించిన వారి సంఖ్య 85 వేలకు పైగానే ఉంటుందని మరో అంచనా ఉందని తెలిపాయి. కాల్పుల విరమణకోసం జరుగుతున్న అర్థవంతమైన అన్ని చర్చలను ఇజ్రాయెల్ తొక్కేస్తూ మరోవైపు ఏడాది పొడగునా దాడి కొనసాగిస్తున్నదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పాలస్తీనాకు సంఘీభావంగా ఈ నెల 7వ తేదీన జరిగే ఈ సదస్సును జయప్రదం చేయాలని ప్రజలకు వామపక్ష పార్టీలు విజ్ఞప్తి చేశాయి.