మళ్లీ బర్డ్‌ ఫ్లూ కలకలం

ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో : తెలంగాణలో మళ్లీ బర్డ్‌ ఫ్లూ కలకలం రేపింది. దాదాపు నెల రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్‌లో బర్డ్‌ ఫ్లూ వ్యాధి కోళ్లకు సోకిందన్న సమాచారంతో సరిహద్దులో నిఘా పెట్టి తెలంగాణ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంది. తాజాగా నల్గొండ జిల్లాలో కోళ్ల ఫామ్‌లలో కోళ్లకు బర్డ్‌్‌ ఫ్లూ పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్‌ శివారులోని చిట్యాల మండలం గుండ్రాంపల్లి కోళ్ల ఫామ్‌లో సుమారు రెండు లక్షల కోళ్లను చంపి వాటిని నాలుగు అడుగుల లోతు గుంత తీసి జెసిబి సహాయంతో పూడ్చేశారు. తెలంగాణ వ్యాప్తంగా కోళ్ల పామ్‌లలో పరీక్షలు నిర్వహించాలని పశుసంవర్దక శాఖ జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. బర్డ్‌ ఫ్లూ ఉన్న కోళ్ల ఫామ్‌కు పది కిలోమీటర్ల పరిధిని రెడ్‌ జోన్‌గా పరిగణిస్తున్నామని, ఆ ప్రాంతాన్ని మూడు జోన్‌లుగా విభజించి పర్యవేక్షిస్తున్నామని అధికారులు తెలిపారు. హైదరాబాద్‌ శివారులో బర్డ్‌ ఫ్లూ కలకలం రేపడంతో ఆదివారం నగరంలో చికెన్‌ విక్రయాలు భారీగా తగ్గాయి. చేపలు, మటన్‌కు గిరాకీ పెరిగింది.

➡️