కంది ధర పతనం

Jan 17,2025 09:14 #Fall in the price of rice
  • గత డిసెంబర్‌లో రూ.10 వేలు.. ఇప్పుడు రూ.ఆరు వేలు

ప్రజాశక్తి – చిప్పగిరి : కంది ధర పతనమైంది. గత డిసెంబర్‌ నెలలో క్వింటా ధర రూ.10 వేలు ఉండేది. ప్రస్తుతం రూ.6 వేలకు పడిపోయింది. మద్దతు ధరకు కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ప్రయివేట్‌ వ్యాపారులకు అమ్ముకుని రైతులు నష్టపోతున్నారు. చిప్పగిరి మండలంలోని నంచర్ల, దౌల్తాపురం, రామదుర్గం, నగరడోనా, నేమకల్లు, బెల్డోన, కుందనగుర్తి, చిప్పగిరి గ్రామాల్లో 10,340 ఎకరాల్లో కంది పంట సాగు చేశారు. సాగుకు ఎకరాకు దాదాపు రూ.30 వేల దాకా పెట్టుబడి ఖర్చు అవుతుందని రైతులు చెబుతున్నారు. ఈ ఏడాది ఎకరాకు 4 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. గత డిసెంబర్‌ నెలలో క్వింటా కంది ధర రూ.పది వేలు, రూ.తొమ్మిది వేలు పలికింది. పంట రైతుల చేతికి వచ్చే సమయానికి రూ.ఆరు వేలకు పడిపోవడంతో రైతులకు దిక్కుతోచడం లేదు. ఎకరాకు దాదాపు 30 వేల దాకా పెట్టుబడి పెట్టామని, క్వింటా రూ.ఆరు వేలకు అమ్మితే పెట్టిన పెట్టుబడి కూడా రాదని ఆవేదన చెందుతున్నారు. స్థానిక వ్యాపారులు ఒక క్వింటాకు ఐదు కిలోల వరకు తరుగు తీసుకుంటుండడంతో ఇక నష్టాలే మిగులుతాయని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం మద్దతు ధరతో కందిని క్వింటా రూ.7,500 ప్రకారం కొనుగోలు చేస్తామని చెప్పినా ఆ దిశగా ఏర్పాటు చేయలేదు. ఆలస్యం అవుతుండడంతో రైతులు స్థానిక వ్యాపారులకు అమ్ముకోవాల్సి వస్తోందని ఆందోళన చెందుతున్నారు. మరికొందరు కందులను కళ్లాల్లోనూ, ఇంట్లోనూ నిల్వ చేసుకుంటున్నారు.

➡️