ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వైసిపి ఆధ్వర్యంలో ఈ నెల 12న చేపట్టనున్న ‘యువత పోరు’ కార్యక్రమంలో యువత, నిరుద్యోగులను మోసం చేస్తోన్న కూటమి ప్రభుత్వ వైఖరిని నిలదీయాలని వైఎస్‌ఆర్‌సిపి రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. యువత పోరు, పార్టీ ఆవిర్భావ దినోత్సవాలపై తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఆదివారం రీజినల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ… ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.3,900 కోట్లు ఉంటే, బడ్జెట్‌లో కేవలం రూ.2,600 కోట్లు మాత్రమే ప్రభుత్వం కేటాయించిందన్నారు. మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేయాలని ప్రయత్నిస్తోందని తెలిపారు. ఈ నెల 12న వైసిపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఉత్సాహంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. మండల కమిటీల ఏర్పాటుకు నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు చర్యలు తీసుకోవాలని సూచించారు.
