14న చలో ఢిల్లీని జయప్రదం చేయాలి

Mar 4,2024 10:20 #chalo delhi

రైతు సంఘాల సమన్వయ సమితి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : డాక్టర్‌ ఎంఎస్‌ స్వామినాథన్‌ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని, రైతు, కౌలురైతుల పంట రుణాలను రద్దు చేయాలని కోరుతూ.. సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపు మేరకు ఈ నెల 14న చేపట్టనున్న చలో ఢిల్లీని జయప్రదం చేయాలని ఎపి రైతు సంఘం సీనియర్‌ నాయకులు వై కేశవరావు డిమాండ్‌ చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యాన 1తి గ్రామంలో, మండల కేంద్రాల్లో రైతులు పెద్దయెత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యాన రైతు సంఘం నాయకులు చుండూరు రంగారావు అధ్యక్షతన రైతు సంఘాల సమన్వయ సమితి సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో వై కేశవరావుతోపాటు సంయుక్త కిసాన్‌ మోర్చా జాతీయ నాయకులు రావుల వెంకయ్య మాట్లాడారు. స్వామినాథన్‌ కమిటీ సిఫార్సుల మేరకు కనీస మద్దతు ధర ప్రకటించి చట్టం చేయాలని డిమాండ్‌ చేశారు. దేశవ్యాప్తంగా రైతులను రుణవిముక్తి చేసి, ఆత్మహత్యల నుంచి కాపాడేందుకు ఒకసారి రైతు, కౌలురైతుల పంట రుణాలను పూర్తిగా మాఫీ చేయాలన్నారు. అలాగే కేరళ తరహాలో రుణ ఉపశమన చట్టం తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. గత రైతాంగ ఉద్యమం సందర్భంగా రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ నెల 14న ఢల్లీలో మహా పంచాయత్‌ (బహిరంగ సభ)ను నిర్వహించనున్నామని, ఈ సభలో పెద్దయెత్తున రైతాంగం పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్పొరేట్లకు కొమ్ముకాస్తున్న మోడీని గద్దె దించి, బిజెపి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కోరారు. రైతు ఉద్యమంలో పంజాబ్‌ యువ రైతు శుభ్‌ కరణ్‌ సింగ్‌ను హర్యానా రాష్ట్ర ప్రభుత్వం బలి తీసుకుందని విమర్శించారు. ఈ హత్యపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతాంగంతో సంప్రదించకుండానే పెట్టిన విద్యుత్‌ బిల్లును ఉపసంహరించుకోవాలన్నారు. పార్లమెంటులో ఈ బిల్లు ఆమోదం పొందకుండానే రాష్ట్రంలోని జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వ్యవసాయ మోటార్లకు స్మార్ట్‌ మీటర్లు పెట్టడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. 14న జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కె సుబ్బరావమ్మ, ఎఐటియుసి రాష్ట్ర డిప్యూటీ కార్యదర్శి ఎం వెంకటసుబ్బయ్య, ఇఫ్టూ కార్యదర్శి పోలారి తదితరులు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తక్షణమే కార్మిక హక్కులను హరించే నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కనీస వేతనం రూ.26 వేలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని, విశాఖ ఉక్కు ప్రైవేటీ కరణ నిలుపుదలను చేయాలని, కడప ఉక్కును వెంటనే నిర్మించాలని డిమాండ్‌ చేశారు. రైతాంగం చేపట్టిన ఉద్యమంలో కార్మిక రంగం భాగస్వామి కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎపి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య, ఎపి కౌలురైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం హరిబాబు, కార్యదర్శి పి జమలయ్య, రైతు సంఘాల నాయకులు యల్లమందారావు, డి హరినాథ్‌, మరీది ప్రసాద్‌, యు వీరబాబు, గొల్లపూడి ప్రసాద్‌, వి నరసింహారావు, కొలనకొండ శివాజి, జి రంగారెడ్డి, పంచుమాటి అజరు, కార్మిక సంఘాల నాయకులు ఆర్‌వి నరసింహారావు, కాసాని గణేష్‌, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️