- సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్‌లో విచారణ
ప్రజాశక్తి-కడప అర్బన్ : వైసిపి సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్‌రెడ్డిని పోలీసులు మరోసారి కస్టడీకి తీసుకున్నారు. కడప జిల్లా కోర్టు అనుమతి మేరకు రవీందర్‌రెడ్డిని రెండు రోజులపాటు పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. కడప సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్లో బుధవారం లాయర్ సమక్షంలో విచారించారు. వర్రాను అదుపులోకి తీసుకున్న వెంటనే ఆయనను కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. గతంలో వర్రా ఇచ్చిన స్టేట్‌మెంట్ మేరకు కడప ఎంపి వైఎస్ అవినాష్‌రెడ్డి పిఎ బండి రాఘవరెడ్డిపై పులివెందుల పోలీసులు కేసు నమోదు చేయగా ఆయన ముందస్తు బెయిల్ తీసుకుని పలుమార్లు పోలీసు విచారణకు హాజరయ్యారు. ఇటీవల ఆయన బెయిల్ రద్దు కావడంతో పులివెందుల పోలీసులు కూడా ఆయనను మంగళవారం విచారించారు. గతంలో వర్రా రవీందర్‌రెడ్డిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు రాష్ట్రంలో నమోదైన పలు కేసులకు సంబంధించి విచారణలో భాగంగా సంబంధిత కోర్టుల్లో హాజరవుతున్నారు. కడప జిల్లా కోర్టు అనుమతి ఇచ్చిన మేరకు మరల రెండు రోజులపాటు వర్రాను పోలీసులు విచారిస్తున్నారు.