నవరత్న నిలయంపై దాడి

Jun 9,2024 22:07 #Guntur District, #TDP Attacks
  • విగ్రహాలు, శిలాఫలకాలు ధ్వంసం

ప్రజాశక్తి-యంత్రాంగం : రాష్ట్రంలో పలుచోట్ల వైసిపి ప్రభుత్వం హయాంలో ఏర్పాటు చేసిన వైఎస్‌ఆర్‌ విగ్రహాలు, శిలాఫలకాలను శనివారం రాత్రి గుర్తు తెలియని దుండగుటు ధ్వంసం చేశారు. తిరుపతిలో నవరత్నాల నిలయంపై దాడి చేశారు. నవరత్నాల నిలయం ముందు నిర్మించిన రైతు, గ్రామీణ మహిళ విగ్రహాలను కూలదోశారు. గుంటూరులో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించిన శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే టిడిపి కార్యకర్తలు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని వైసిపి నేతలు మండిపడ్డారు.


తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని రాజీవ్‌నగర్‌లో సుమారు 2 వేల మంది పేదలకు జగనన్న కాలనీ పేరిట ఇళ్ల స్థలాలు ఇచ్చారు. కాలనీకి ముందు అప్పటి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి జగన్‌కు కృతజ్ఞతగా నవరత్నాలు నిలయాన్ని నిర్మించారు. దీనిలో నవరత్నాల పథకాలు ప్రతిబింబించేలా కట్టడాలు, వైఎస్‌ఆర్‌ చిత్రపటాలు, రైతుల విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది జూన్‌ 4న టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత గుర్తు తెలియని వ్యక్తులు నవరత్నాల గుడిపై దాడి చేశారు. శ్రీకాళహస్తి-పిచ్చాటూరు రోడ్డు మార్గంలో రాజీవ్‌నగర్‌ పరీవాహక ప్రాంతంలో కొందరు వైసిపి నాయకులు ప్రభుత్వ స్థలంలో నిర్మించుకున్న అక్రమ కట్టడాలను సైతం కూలదోసే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో గస్తీకి వచ్చిన పోలీసులను చూసి దుండగులు పారిపోయినట్లు సమాచారం. ఈ విషయంపై టూటౌన్‌ పోలీసులను వివరణ కోరగా తమకు మున్సిపల్‌ అధికారుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలపడం గమనార్హం.
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో మాజీ సిఎం జగన్‌ గతేడాది మేలో రాజధాని గ్రామాల్లో పేదలకు 54 వేల ఇళ్ల స్థలాలు కేటాయించి ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని, నమూనా ఇంటిని, స్తూపాన్ని ధ్వంసం చేశారు. గుంటూరు ఎన్‌టిఆర్‌ స్టేడియంలో జిమ్‌ సెంటర్‌ శిలాఫలకాన్ని టిడిపి నాయకులు పగలగొట్టారు. వైఎస్‌ఆర్‌ పేరుతో ఉన్న పేరును తొలగించి ఎన్‌టిఆర్‌ జిమ్‌ సెంటర్‌గా బోర్డు మార్చారు.

➡️