పరిశీలనాత్మక దృక్పథంతో ఏ రంగంలోనైనా రాణించొచ్చు

  • ప్రముఖ సినీ నటులు అజయ్ ఘోష్‌
  • ఘనంగా తెలుగు షార్ట్‌ ఫిల్మ్‌ పోటీలు

ప్రజాశక్తి – విజయవాడ అర్బన్‌ : సినిమా ద్వారా సమాజానికి మంచి సందేశం ఇవ్వాలని, పరిశీలనా దృక్పథం ఉంటేనే దర్శకుడిగా, నటులుగా రాణించగలుగుతారని ప్రముఖ సినీ నటులు అజయ్ ఘోష్‌ అన్నారు. తెలుగు షార్ట్‌ ఫిల్మ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో విజయవాడలోని ఎంబి భవన్‌లో షార్ట్‌ ఫిలిమ్స్‌, ప్రయివేట్‌ పాటల వీడియోలు, రీల్స్‌ పోటీలు ముగింపు కార్యక్రమం ఆదివారం సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరైన అజయ్ ఘోష్‌ మాట్లాడుతూ దర్శకులుగా రాణించాలంటే ప్రతి ఒక్కరూ సాహిత్యాన్ని, అంతకంటే ముఖ్యంగా పుస్తకాలు చదవాలన్నారు. సాహిత్యం ద్వారా సమాజ ప్రగతికి మార్గం చూపాలని పేర్కొన్నారు. ప్రతి అంశాన్ని కొత్త కోణంలో ఆలోచించడంతోపాటు సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని సినిమా లేదా షార్ట్‌ ఫిల్మ్‌ ద్వారా మంచి సందేశం ఇవ్వాలని సూచించారు. సృజనాత్మకతతో పాటు విద్యార్థిగా ప్రతి అంశాన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా ఇటువంటి పోటీలు నిర్వహించే వేదిక లేదని, ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకొని మంచి దర్శకులుగా, నటులుగా రాణించాలని ఆకాక్షించారు. ప్రముఖ సినీ దర్శకులు రామ్‌ భీమన మాట్లాడుతూ.. సినిమా ద్వారా మనం చూపించాలనుకునే అంశాన్ని కొత్త కొణంలో కొత్తదనంగా చూపించాలని తెలిపారు. ఉన్నతస్థాయి విలువలతో చక్కని సందేశాన్ని సినిమా ద్వారా సమాజానికి అందించాలన్నారు. తాను కూడా చిన్నప్పుడు షార్ట్‌ ఫిల్మ్‌లు తీసి దర్శకుడిగా ఎదిగానని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమలోని ప్రతిభకు పదునుపెట్టి చక్కగా రాణించాలన్నారు. ఈ కార్యక్రమానికి తెలుగు షార్ట్‌ ఫిల్మ్‌ అసోసియేషన్‌ గౌరవాధ్యక్షులు యడ్ల పార్థసారధి అధ్యక్షత వహించగా.. అమరావతి బాలోత్సవ్‌ అధ్యక్షులు ఆర్‌.కొండలరావు, తెలుగు షార్ట్‌ ఫిల్మ్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు బికెఎస్‌ ప్రసాద్‌, డివి రాజు, ఎంబివికె కార్యదర్శి పిన్నమనేని మురళీకృష్ణ, ప్రముఖులు గోళ్ల నారాయణరావు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం తెలుగు సినీ పాటల పోటీలు, రీల్స్‌, షార్ట్‌ ఫిల్మ్‌ విజేతలకు బహుమతులను అందజేశారు.

➡️