వంద శాతం కాంట్రాక్టీకరణ !

May 29,2024 08:52 #CITU, #Dharna

– విశాఖ రైల్‌ వ్యాగన్‌ వర్క్‌షాప్‌ నిర్వహణ తీరు
-కనీస వేతనానికి నోచని కార్మికులు
ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో :విశాఖలోని రైల్‌ వ్యాగన్‌ వర్క్‌షాప్‌ నిర్వహణలో కాంట్రాక్టీకరణకే పెద్దపీట వేశారు. దేశంలోనే ఒక్క పర్మినెంట్‌ రైల్వే ఉద్యోగీలేని వర్క్‌షాప్‌ ఇది. వంద శాతం కాంట్రాక్టీకరణతో ఇది నడుస్తోంది. 2015-16 రైల్వే బడ్జెట్లో కేటాయించిన రూ.213 కోట్ల అంచనా వ్యయంతో 203 ఎకరాల విస్తీర్ణంలో విశాలంగా ఈ రైల్‌ వ్యాగన్‌ వర్క్‌షాప్‌ను రైల్వే శాఖ ఆధ్వర్యాన నిర్మించారు. నెలకు 200 వ్యాగన్లు (రైలు బోగీలు)ను రిపేరు చేసేందుకు 2022లో పూర్తి స్థాయిలో ఆపరేషన్స్‌లోకి దీన్ని తెచ్చారు. 203 ఎకరాలకుగాను 57 ఎకరాల్లో రైల్‌ పరిపాలనా భవనం నిర్మించారు. ఈ వ్యాగన్‌ వర్క్‌షాప్‌ లోపల రైల్వే ట్రాక్‌లు ఉన్నాయి.
సరుకుల రవాణాకు అనువుగా…
విశాఖపట్నం, గాజువాక ప్రాంతంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఉన్నాయి. ఫార్మా, స్టీల్‌, హెచ్‌పిసిఎల్‌, కోరమండల్‌, ఇతర అల్యూమినియం రైల్‌ ర్యాకుల నిర్వహణకు కేంద్రంగా ఈ వ్యాగన్‌ వర్క్‌షాప్‌ను ఏర్పాటు చేశారు. వైజాగ్‌ పోర్టు, గంగవరం పోర్టు కూడా దగ్గర్లోనే ఉండడంతో సరుకుల రవాణాకు అనువైన రైల్‌ ర్యాకులు (బోగీలు)ను అందించే పని ఈ వ్యాగన్‌ వర్క్‌షాప్‌దే. పాత బోగీలను, పాడైన బోగీలను ఈ వర్క్‌షాపునకు తీసుకొచ్చి మరలా కొత్తవిగా మార్చే ప్రక్రియ ఇక్కడ చేపడుతున్నారు. ఇంతకీలకమైన ఈ వర్క్‌షాపులో పర్మినెంట్‌ ఉద్యోగులు లేరు. వర్కర్లుగా ఐటిఐ, ఇంజనీరింగ్‌ డిప్లమో చేసిన వాళ్లు వందల సంఖ్యలో ఉన్నారు. వీరెవరికీ కనీస వేతనాలు అమలు కాకపోవడంతో కొంతకాలంగా ఆందోళనలు చేపడుతున్నారు.
12 గంటల పని… ఓటీలకు చెల్లుచీటి
మొత్తం 600 మంది కార్మికులు ఇక్కడ కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్నారు. విధుల్లో చేరిన తొలి రోజుల్లో తమకు పర్మినెంట్‌ అయి మంచి జీతాలు లభిస్తాయని వీరంతా ఆశించారు. వెల్డంగ్‌, కట్టింగ్‌, ఫిట్టింగ్‌, క్రేన్‌ ఆపరేషన్‌, రైలింజిన్‌ చక్రాల గేర్‌ బాక్సులు తయారీ వంటి పనులు వీరు నిర్వహిస్తున్నారు. పర్మినెంట్‌ సంగతి మరచిపోవాలని రైల్వే అధికారులు చెప్పడంతో వీరు తీవ్ర కలత చెందుతున్నారు. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ జారీ చేసిన జిఒ ప్రకారం వీరికి రోజుకు రూ.850 కనీస వేతనం చెల్లించాలి. ఇటీవల వరకూ రూ.512 మాత్రమే చెల్లిస్తూ వచ్చారు. జిఒ ప్రకారం జీతం ఇవ్వడం లేదని, ఓవర్‌ టైం డ్యూటీలు 12 గంటలు చేస్తున్నా అదనంగా డబ్బులు చెల్లించడం లేదని నిలదీసిన ఒక కార్మికుడిని విధుల నుంచి కాంట్రాక్టర్‌ ఇటీవల తొలగించారు. ఈ నేపథ్యంలో సిఐటియు గాజువాక జోన్‌ కమిటీ పోరాడడంతో ఆ కార్మికుడిని తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. కార్మికుల రోజువారీ వేతనం రూ.612కు పెంచారు.
కాంట్రాక్టర్ల గుప్పెట్లోనే…
గతంలో రైల్‌ వ్యాగన్‌ వర్క్‌షాప్‌ ఇక్కడ లేకపోవడంతో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లకు వ్యాగన్లు రిపేర్లకు వెళ్లేవి. విశాఖలోని రెండు పోర్టుల నుంచి సరుకులను ఇతర రాష్ట్రాలు, వివిధ ప్రాంతాలకు రైల్‌ వ్యాగన్లలో తరలించే ఏర్పాట్లలో తీవ్ర జాప్యం జరిగేది. వందల కిలోమీటర్ల మేర వ్యాగన్లను రిపేర్లకు తీసుకెళ్లడంతో సరుకు రవాణాపై ప్రభావం పడేది. విశాఖలోనే ఈ వర్క్‌షాప్‌ రావడంతో వ్యాగన్లు ఇప్పుడు ఇక్కడే మరమ్మతులు చేస్తున్నారు. పలు విభాగాల్లో వందల సంఖ్యలో కార్మికులు తమ రెక్కల కష్టంతో పనిచేసి వ్యాగన్లను ఆధునికీకరిస్తున్నా వారి శ్రమకు తగ్గ వేతనం రావడం లేదు. వ్యాగన్‌ వర్క్‌షాప్‌లోని విభాగాలన్నీ 25 మంది కాంట్రాక్టర్ల నియంత్రణలో ఉన్నాయి. వ్యాగన్‌ వర్క్‌షాప్‌ రైల్వేదే అయినా, కాంట్రాక్టీకరణతో దీంట్లో పనిచేసే కార్మికుల హక్కులు కాలరాయబడుతున్నాయి. భద్రత కరవవుతోంది. పాత బోగీలను కొత్త బోగీలుగా మార్చే దశలో పెయింటింగ్‌ పనులు చేస్తున్నప్పుడు కెమికల్స్‌ చేతులపై పడుతున్నాయని, తమకు భద్రతా దుస్తులు కూడా ఇవ్వడం లేదని కార్మికులు ఆవేదన చెందుతున్నారు.
సరైనది కాదు
వంద శాతం కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌తో వచ్చిన వ్యాగన్‌ వర్క్‌షాప్‌ ఇదే. గతంలో కొంతమందైనా పర్మినెంట్‌ ఉద్యోగులు ఉండేవారు. ఇప్పుడలా లేదు. అవుట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ వ్యవస్థల వల్ల బాధ్యతలను నిర్ణయించడం కష్టమైన పని. ఇప్పుడు జరుగుతున్న వివిధ విభాగాల పనులే కాకుండా రాబోయే రోజుల్లో రైలు చక్రాలు, విడి భాగాల పని కూడా ఇక్కడే చేపట్టనున్నారు. పనిభారం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగులను పర్మినెంట్‌ చేసి వేతనాల సమస్య రాకుండా అధికారులు చర్యలు చేపట్టాలి.

-సిహెచ్‌.నర్సింగరావు, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

➡️