ప్రతి నియోజకవర్గానికీ ఒక ఇండస్ట్రియల్‌ పార్క్‌

  • నేమకల్లులో ‘పేదల సేవ’లో ముఖ్యమంత్రి చంద్రబాబు

ప్రజాశక్తి- అనంతపురం, బొమ్మనహాల్‌ : రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఒక ఇండిస్టీయల్‌ పార్క్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ అమలుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అనంతపురం జిల్లా బొమ్మనహాల్‌ మండలం నేమకల్లులో శనివారం జరిగిన ‘పేదల సేవలో’ కార్యక్రమానికి ఆయన హాజరై లబ్ధిదారులకు సామాజిక పింఛను అందజేశారు.
విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో జిందాల్‌ విజయనగర ఎయిర్‌ పోర్టుకు వచ్చిన చంద్రబాబు అక్కడి నుంచి హెలికాప్టర్‌లో నేమకల్లుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. మొదట గ్రామంలోని రెండు నిరుపేద కుటుంబాలకు పింఛను అందజేసిన ముఖ్యమంత్రి గ్రామంలోని నేమకల్లు ఆంజనేయస్వామి పురాతన ఆలయాన్ని సందర్శించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన ‘పేదల సేవలో’ ప్రజావేదిక సభలో చంద్రబాబు మాట్లాడారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా టిడిపి కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఉపాధి కోసం యువత ఎక్కడో దూరప్రాంతాలకు వెళ్లకుండా వారి నియోజకవర్గ పరిధిలోనే ఉపాధి కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ఒక ఇండిస్టీయల్‌ పార్క్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు.

వరాల జల్లు

రాయదుర్గం నియోజకవర్గానికి చంద్రబాబు వరాల జల్లు కురిపించారు. బైరవానితిప్ప ప్రాజెక్టును హంద్రీనీవా నీటితో నింపుతామని ప్రకటించారు. ఆ నీటితో ఇంటింటికీ కుళాయి పథకాన్ని పూర్తి చేస్తామన్నారు. రాయదుర్గం నియోజకవర్గంలో నిరుద్యోగ యువత ఉపాధి కోసం ఇండిస్టీయల్‌ పార్క్‌, నేమకల్లు, ఉంతకల్లు మధ్యలో ఐదు టిఎంసిల సామర్థ్యంతో రిజర్వాయర్‌ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ ప్రాంతంలో ఐరన్‌ ఎక్కువగా లభ్యమవుతున్న నేపథ్యంలో మరిన్ని పరిశ్రమలు వచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. నేమకల్లులోని ఆంజనేయస్వామి ఆలయ గోపురాల అభివృద్ధికి రూ.3 కోట్ల మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. నేమకల్లు పర్యటన అనంతరం హెలీప్యాడ్‌ వద్ద జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో సిఎం చంద్రబాబు సమావేశమ య్యారు. జిల్లా అభివృద్ధిపై సమీక్షించారు. రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్‌, సవిత, ఎంపి అంబికా లకీëనారాయణ, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్‌ వినోద్‌కుమార్‌, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

➡️