- నీటి కుంటలో జారిపడి ఇద్దరు వలస కార్మికులు మృతి
ప్రజాశక్తి – వినుకొండ (పల్నాడు జిల్లా) : ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి ఇద్దరు వలస కార్మికులు మృతి చెందిన సంఘటన పల్నాడు జిల్లా బొల్లాపల్లి శివారులో శనివారం జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం నుండి బొల్లాపల్లికి కూలి పనులకు వలస వచ్చి పొలంలో నివాసం ఉంటున్న మన్నంగి ఉమా (18), మెల్లక జున్ని (18) సమీపంలోని నీటి కుంటలో స్నానం చేసేందుకు వెళ్లారు. ప్రమాదవశాత్తు కాలు జారి ఉమా నీటిలో పడిపోయారు. ఆమెను రక్షించేందుకు జున్ని ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇద్దరూ నీటిలో మునిగి మతి చెందారు. బొల్లాపల్లి మండలం శివారు ప్రాంతంలో 80 ఎకరాలు భూమిలో విజయవాడకు చెందిన వ్యక్తి శ్రీ గంధం మొక్కలు సాగు చేస్తున్నారు. పొలంలో సంపు ఏర్పాటు చేసి దాని పక్కనే 7 అడుగుల లోతులో ఇంకుడు గుంతను తవ్వారు. ఈ పొలంలో ఒడిశా రాష్ట్రం నుండి 38 కుటుంబాల వారు వచ్చి పనిచేస్తున్నారు. ఇంకుడు గుంతలో వలస కార్మికుల కుటుంబాల మహిళలు బట్టలు ఉతకడం, స్నానం చేయడం వంటివి చేస్తున్నారు. రోజు లాగానే శనివారం ఉదయం నీటి కుంట వద్దకు వెళ్లి స్నానం చేసేందుకు దిగి ప్రమాదవశాత్తు ఇద్దరు నీటిలో మునిగి మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరు యువతుల మతదేహాలను బయటకు తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.