- సిఐటియు ఆధ్వర్యంలో కార్మికుల ధర్నా
ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : రాజమహేంద్రవరం ఒఎన్‌జిసి బేస్ కాంప్లెక్స్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు డ్రైవర్లు తమ వేతన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు. బొమ్మూరులోని ఒఎన్‌జిసి బేస్ కాంప్లెక్స్ మెయిన్ గేటు ఎదుట ఒఎన్‌జిసి కాంట్రాక్టు వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి అరుణ్ మాట్లాడుతూ ఒఎన్‌జిసి బేస్ కాంప్లెక్స్‌లో 350 మందికి పైగా కారు డ్రైవర్లు కాంట్రాక్టు వర్కర్లుగా పని చేస్తున్నారని తెలిపారు. యాజమాన్యంతో ఒప్పందం సమయంలో నిబంధనలకు కాంట్రాక్టర్లు తూట్లు పొడుస్తున్నారన్నారు. సెంట్రల్ లేబర్ డిపార్ట్‌మెంట్ నిర్దేశించిన కనీస వేతనంతో పాటు అదనంగా 35 శాతం ఫెయిర్ వేజ్ ఇవ్వాలని, దీనికి అంగీకరించిన వారే టెండర్లు వేసేందుకు అనుమతి ఉందని గుర్తు చేశారు. రెండేళ్ల క్రితం వరకూ నెలకు రూ.22 వేల నుచి రూ.25 వేల వేతనం తీసుకునే వారని తెలిపారు. కొత్త కాంట్రాక్టరు రెండేళ్లుగా నెలకు రూ.14 వేలు మాత్రమే చెల్లిస్తున్నారన్నారు. ఫెయిర్ వేజ్‌ను దోపిడీ చేసి కాంట్రాక్టర్లు జేబులు నింపుకుంటున్నారని విమర్శించారు. పలుమార్లు డ్రైవర్లు మొర పెట్టుకున్నప్పటికీ పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. గుర్తింపు సంఘాన్ని కూడా పట్టించుకోవడంలేదని తెలిపారు. తక్షణమే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవడంతో పాటూ డ్రైవర్లకు కనీసం వేతనంతో పాటు ఫెయిర్ వేజ్ చెల్లించాలని డిమాండ్ చేశారు. టాక్సీ ఓనర్స్ అండ్ డైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ముచ్చకర్ల సత్యనారాయణ, రాష్ట్ర కోశాధికారి డి సోమశంకర్, ఎవివి సత్యనారాయణ ఈ నిరసనకు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్‌ఎస్ మూర్తి, జిల్లా కోశాధికారి కెఎస్‌వి రామచంద్రరావు, జిల్లా కార్యదర్శి బి పూర్ణిమరాజు, జిల్లా కమిటీ సభ్యులు బి పవన్, ఒఎన్‌జిసి కాంట్రాక్టు వర్కర్స్ ఫెడరేషన్ నాయకులు అప్పారావు, త్రినాథ్, బాబూరావు తదితరులు పాల్గొన్నారు.