- ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్రకమిటీ రాష్ట్రప్రభుత్వాన్ని కోరింది.ఈ మేరకు ఆ సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఎ అశోక్, కె ప్రసన్నకుమార్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన యూనివర్సిటీ కేంద్రం తెలంగాణలో ఉందని తెలిపారు. రాష్ట్ర విభజన తరువాత పదేళ్లు అక్కడే కొనసాగించాలని నిర్ణయించారని పేర్కొన్నారు. పదేళ్లు పూర్తికావడంతో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని సేవలను ఆకస్మికంగా నిలిపివేసిందని తెలిపారు. ఇప్పటికే కోర్సుల్లో చేరి పరీక్ష రాయాల్సిన విద్యార్థులు రెండు లక్షల మంది ఉన్నారని, వీరి పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని వివరించారు. మరో సెమిస్టర్ పూర్తయితేనే డిగ్రీ పట్టా విద్యార్థుల చేతికి వస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తే పరీక్షలు నిర్వహిస్తారో లేదోనని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. రాష్ట్రప్రభుత్వం వెంటనే చొరవచూపి యూనివర్సిటీ కేంద్రాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేసి ఉపకులపతిని నియమించాలని కోరారు.