పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం, లౌకికవాదం పరిరక్షణే లక్ష్యం

-రాజ్యాంగ మౌలిక విలువలను ధ్వంసం చేస్తున్న మోడీ ప్రభుత్వం
-దేశాన్ని రక్షించేందుకే ఇండియా వేదికలో చేరాం
-బిజెపిని గద్దె దించడమే తక్షణ రాజకీయ కర్తవ్యం
– సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు
ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో :పార్లమెంటు ఎన్నికల్లో ప్రజాస్వామ్యం, లౌకికవాదం, నీతి, నిజాయితీని పరిరక్షించుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు తెలిపారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మోడీ నాయకత్వంలో రాజ్యాంగ మౌలిక విలువల పునాదులను ధ్వంసం చేస్తోందన్నారు. దేశాన్ని రక్షించుకోవడం కోసమే ప్రతిపక్షాలు ఇండియా వేదికలో ఉన్నాయని చెప్పారు. 2019లో వచ్చిన ఫలితాలు రావనే భయం బిజెపిలో ఉందని. అందుకే ఎన్‌డిఎకు 400కుపైగా సీట్లు వస్తాయనే నినాదాన్ని ముందుకు తెచ్చిందని పేర్కొన్నారు. మోడీకి భయం లేకుంటే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను, జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ను అరెస్టు చేసేవారు కాదన్నారు. బిజెపిని ఈ ఎన్నికల్లో గద్దెదించడం తమ తక్షణ రాజకీయ కర్తవ్యమని తెలిపారు. బిజెపి మతోన్మాద విధానాలను ప్రశ్నిస్తూ విస్తారంగా దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలని సిపిఎం నిర్ణయించిందని వివరించారు. సిపిఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశం ఆ పార్టీ తెలంగాణ కార్యదర్శివర్గ సభ్యులు టి.జ్యోతి అధ్యక్షతన శనివారం, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అధ్యక్షతన ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఎంబి భవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రాఘవులు మాట్లాడారు. బిజెపి ప్రభుత్వం ప్రతిపక్షాలను కకావికలం చేయాలని చూస్తోందని విమర్శించారు. రాజ్యాంగ వ్యవస్థలను ప్రయోగించి భయభ్రాంతులకు గురి చేస్తోందని, ప్రతిపక్షాల ఎన్నికల ప్రచారాన్ని బలహీనపరిచేందుకు కుట్రలు చేస్తోందని విమర్శించారు. ప్రతిపక్ష నాయకుల ఫిరాయింపులను ప్రోత్సహించి వారికి బిజెపి టికెట్లు ఇస్తోందన్నారు. బిజెపికి బలముంటే ఇవన్నీ ఎందుకు చేస్తోందని ప్రశ్నించారు. ప్రతిపక్షాలను ప్రలోభాలకు గురిచేసి లంగదీసుకోవడం, లేదంటే ఇడి, సిబిఐ, ఐటిని ఉపయోగించి భయభ్రాంతులకు గురిచేయడం, లంగకుంటే అరెస్టు చేసి జైలులో పెడుతుండడం వంటివి చేస్తోందని వివరించారు. అవినీతిపరులు బిజెపిలో చేరితే నీతిపరులవుతున్నారని, నీతిపరులు బయట ఉంటే అవినీతిపరులవుతున్నారని కేజ్రీవాల్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యాలను రాఘవులు ఈ సందర్భంగా గుర్తు చేశారు. నీతికి నిర్వచనాన్ని బిజెపి మార్చివేసిందన్నారు. బిజెపిలో ఉంటే నీతిపరులు, లేదంటే అవినీతిపరులు అన్నట్టుగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఎన్నికల బాండ్లలో అత్యధిక భాగం, రూ.6,566 కోట్లు బిజెపికి వచ్చాయని వివరించారు. అధికారంలో ఎవరుంటారు, ప్రతిపక్షంలో ఎవరుంటారనేది తమకు ముఖ్యం కాదని, దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరముందని అన్నారు. ఆర్థికంగా గొప్ప ముందడుగు వేశామని బిజెపి చెప్తున్న గొప్పలను తోసిపుచ్చారు. బ్రిటీష్‌ వారి కాలం కంటే ఇప్పుడు అసమానతలు ఎక్కువయ్యాయంటూ ఓ సంస్థ ప్రకటించిందని వివరించారు. రాజ్యాంగ మౌలిక విలువలను పరిరక్షించుకోవాలని, ఇందులో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. బిఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక ఆపరేషన్‌ ఆకర్ష్‌ పేరుతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను చేర్చుకున్నారని, ఇప్పుడు రేవంత్‌రెడ్డి ఆపరేషన్‌ ఆకర్ష్‌ పేరుతో బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారని అన్నారు. తెలంగాణలో బిజెపి ప్రమాదం ముంచుకొస్తున్నదని, మతోన్మాద వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బిజెపిని నిలువరించాలని, తెలంగాణ రాష్ట్రంలో ఒక్క ఎంపీ స్థానంలో కూడా గెలవనీయకుండా చూడాలని ప్రజలను కోరారు.

➡️