- స్టీల్‌ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్
ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : ప్యాకేజీల ద్వారా సొమ్మును కేటాయించడం విశాఖ ఉక్కు కర్మాగార సమస్యకు పరిష్కారం కాదని స్టీల్‌ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ (సిఐటియు) ప్రధాన కార్యదర్శి యు.రామస్వామి అన్నారు. స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు గురువారానికి 1337వ రోజుకు చేరుకున్నాయి. దీక్షల్లో సిఐటియు నాయకులు, కార్యకర్తలు, కార్మికులు కూర్చున్నారు. వారినుద్దేశించి ఆయన మాట్లాడుతూ.. స్టీల్‌ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేసి శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. ప్లాంట్ పరిరక్షణ, సొంత గనులు, వర్కింగ్ క్యాపిటల్ కేటాయింపునకు సంఘం ఆధ్వర్యాన వివిధ రూపాల్లో ఆందోళనలు చేపట్టామని, రక్తదాన శిబిరాలు నిర్వహించామని గుర్తుచేశారు. కర్మాగార పరిరక్షణ విషయమై దశాబ్ద కాలంగా కార్మికుల్లో చైతన్యం తీసుకొస్తున్నామన్నారు. సంఘం సీనియర్ నాయకులు ఎన్.రామారావు మాట్లాడుతూ.. ప్రభుత్వ విధానాలతోనే ప్లాంట్‌కు నేడు గడ్డు పరిస్థితి ఎదురైందని విమర్శించారు. ప్రభుత్వాల అనాలోచిత నిర్ణయాల వల్ల ప్లాంట్ నష్టాల వైపు వెళ్లిందన్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవచూపి కర్మాగార రక్షణకు చర్యలు తీసుకుని భావి తరాలకు స్టీల్‌ప్లాంట్‌ను అందించాలన్నారు. దీక్షల్లో సంఘం నాయకులు శ్రీనివాసరాజు, గంగాధర్, భానుమూర్తి, కెఆర్‌కె.రాజు, పుల్లారావు, దేముడు నాయుడు, బాలశౌరి, రాజు, వి.మురళి, మొహిద్దిన్, డిఎస్‌విఎస్.శ్రీనివాస్, డిసిహెచ్.వెంకటేశ్వరరావు, రామచంద్రరావు పాల్గొన్నారు.