కోలుకుంటున్న పల్నాడు

పల్నాడు : ఎట్టకేలకు పల్నాడు జిల్లా చిరు వ్యాపారాలు తెరుచుకుంటున్నాయి. ఎన్నికల నేపథ్యంలో గత మూడు రోజులుగా రాజకీయ ఘర్షణలతో  వణుకుతున్న పల్నాడు జిల్లా ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. మాచర్లలో అదనపు బలగాలను మోహరింపజేసి.. పరిస్థితిని చక్కదిద్దుతున్నారు. ఇందు కోసం ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఎస్పీ బిందు మాధవ్‌  స్వయంగా మాచర్లలోనే మకాం వేశారు. ఈ చర్యలతో శాంతిభద్రతలు కొంతమేరకు అదుపులోకి రావడంతో వ్యాపారాలు తెరుచుకుంటున్నాయి. రెచ్చగొట్టి, అల్లర్లు సృచించే వారిని గుర్తించిన పోలీసులు వారిని గృహనిర్బంధము చేశారు. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేవరకూ 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని ఎస్పీ బిందు మాధవ్‌ తెలిపారు. ప్రధాన పట్టణాల్లో భారీగా పోలీసులు మోహరించారు. మాచర్ల పట్టణంలో పోలీసులు 1500 మంది బలగాలను మోహరింపజేసి.. 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. పట్టణంలోకి ప్రవేశించే మార్గాల్లో ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. కొత్త వ్యక్తులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. గ్రామాల్లోనూ పోలీస్ పికెటింగ్ కొనసాగుతోంది. కారంపూడి, గురజాల, పిడుగురాళ్ల, దాచేపల్లి పట్టణాల్లోనూ భారీగా పోలీసులు ఉన్నారు. నరసరావుపేట, మాచర్లలో జరిగిన అల్లర్ల ఘటనల్లో కేసులు నమోదు చేశామని ఎస్పీ బిందు మాధవ్‌ తెలిపారు.

➡️