- రాజకీయాలకు అతీతంగా పాల్గోవాలి : మంత్రి లోకేష్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పాఠశాల విద్యాశాఖలో అతిపెద్ద పండగగా డిసెంబరు 7న రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రులు – ఉపాధ్యాయుల సమావేశం (పిటిఎం) నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా తమ పరిధిలోని పాఠశాలల్లో జరిగే ఈ సమావేశంలో పాల్గొనాలని శుక్రవారం బహిరంగ లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఎడ్యుకేట్, ఎంగేజ్, ఎంపవర్ లక్ష్యాలతో దేశంలోనే తొలిసారిగా ఒకేసారి నిర్వహించాలని నిర్ణయించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా పిల్లల చదువు, ప్రవర్తన, క్రమశిక్షణ తల్లిదండ్రులు తెలుసుకోవచ్చునని తెలిపారు. పిల్లల సమస్యలు, అభ్యసనా సామర్ధ్యాలు, క్రీడలు, కళలు పట్ల ఆసక్తులను ఉపాధ్యాయుల ముందుంచి వారిని మరింతగా ఆయా అంశాల్లో పరిణతి సాధించేలా ప్రోత్సహించవచ్చని పేర్కొన్నారు. విద్యా వ్యవస్థను రాజకీయాలకు దూరంగా ఉంచడం, విద్య నేర్చుకునే పిల్లలు, వారి తల్లిదండ్రులను పాఠశాలలకు దగ్గర చేయడం తమ ప్రభుత్వం లక్ష్యమని వెల్లడించారు. పేరెంట్, టీచర్ సమావేశానికి హాజరయ్యే ప్రజాప్రతినిధులు ఏ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నా తమ పార్టీ జెండాలు, కండువాలు, రంగులు వేసుకుని రావొద్దని విజ్ఞప్తి చేశారు. పాఠశాలలకు విరాళాలిచ్చిన దాతలు, పాఠశాలల అభివృద్ధికి దోహదపడే పూర్వ విద్యార్థులు, స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా ఈ సమావేశంలో భాగం కావాలని కోరారు.