- పాస్టర్ ప్రవీణ్ మృతిపై ఏలూరు రేంజ్ ఐజి అశోక్‌కుమార్
ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : హైదరాబాద్‌కు చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల సెల్ప్ యాక్సిటెండ్ వల్లే మృతి చెందినట్టు ఏలూరు రేంజి ఐజి జివిజి.అశోక్‌కుమార్ ప్రకటించారు. పాస్టర్ ప్రవీణ్ హైదరాబాద్ నుంచి రాజమండ్రి తన మోటారు సైకిల్ వస్తూ గత నెల 25న రాజానగరం సమీపంలో అనుమానాస్పదంగా మృతి చెందిన సంగతి తెలిసింది. దీంతో, ఈ మృతిపై సమగ్ర దర్యాప్తు చేయాలని క్రైస్తవ సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ఏలూరు రేంజ్ ఐజి అశోక్‌కుమార్ దర్యాప్తు జరిపారు. రాజమహేంద్రరవంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్లలో ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. సెల్ప్ యాక్సిడెంట్ వల్లే ప్రవీణ్ మృతి చెందారని చెప్పారు. మద్యం సేవించినట్టు, గాయాలు ప్రమాదం వల్లే అయినట్టు పోస్టుమార్టం రిపోర్టులో వైద్యులు ధ్రువీకరించారని తెలిపారు. ప్రవీణ్ తన టూ వీలర్‌పై హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి పయనమయ్యారని తెలిపారు. మద్యం సేవించి అతివేగంగా వాహనం నడపడం వల్లే ప్రమాదానికి గురై మరణించారని చెప్పారు. రాజమహేంద్రవరం వచ్చే వరకు దారి పొడవునా సిసి ఫుటేజ్‌ను సేకరించామని, వాటిని హైదరాబాద్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపామని చెప్పారు. దారి పొడవునా ప్రవీణ్‌ను గమనించిన వారిని, ఫోన్‌లో మాట్లాడిన వారందరినీ విచారించామని చెప్పారు. కుటుంబ సభ్యులను కూడా విచారించామని తెలిపారు. ప్రవీణ్ మృతి చెందిన స్థలాన్ని విజయవాడ ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలించి ఆధారాలు సేకరించారని చెప్పారు. ప్రవీణ్ ప్రయాణించిన బైక్‌తోపాటు 4 నుంచి 6 వాహనాలను, అనుమానాస్పదంగా ఉన్న బైక్‌లను కూడా ఎగ్జామిన్ చేశామని తెలిపారు. ఆయన యుపిఐ పేమెంట్ల వివరాలు సేకరించినట్టు చెప్పారు. హైదరాబాద్‌లో సవేరా లిక్కర్ షాపు, కోదాడలోని ఆదిత్య వైన్స్, ఏలూరులోని నిపునస్ టానిక్స్ వైన్ షాపుల్లో బకాడి, బడ్వైజర్, రాయల్ ఛాలెంజ్ మద్యం కొనుగోలు చేసినట్లు తమ దర్యాప్తులో వెల్లడైందని తెలిపారు. ప్రవీణ్ ప్రయాణం చేస్తూ ఆరుగురితో సెల్‌ఫోన్లో మాట్లాడినట్లు గుర్తించామని చెప్పారు. ప్రవీణ్‌ది హత్యని కొంతమంది సోషల్ మీడియాలో అనుమానాలు వ్యక్తం చేశారని, ఈ నేపథ్యంలో 11 మందిని విచారించామని తెలిపారు. అయితే ఎవరి వద్దా వారి ఆరోపణలకు తగిన ఆధారాలు లభించలేదన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో 70 కిలోమీటర్ల వేగంతో ప్రవీణ్ ప్రయాణిస్తున్నారని తెలిపారు. ప్రమాదానికి గురైన బుల్లెట్ 4వ గేర్‌లో ఉందని రవాణా శాఖ అధికారులు నివేదిక ఇచ్చారని చెప్పారు. ప్రవీణ్ వాహనాన్ని ఎవరూ ఢ కొట్టలేదని రవాణా శాఖ అధికారులు, పోలీసులు విచారణ అనంతరం నిర్ధారించారని తెలిపారు. అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎస్‌పి డి.నరసింహ కిషోర్, పోలీసు అధికారులు పాల్గొన్నారు.