టిటిడి ఇఒ, పాలక మండలి క్షమాపణ చెప్పాలి

Jan 10,2025 23:51 #pawan kalyan, #pitapuram, #speech
  • పిఠాపురం సభలో డిప్యూటీ సిఎం పవన్‌కల్యాణ్‌

ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి : ‘తిరుపతిలో తొక్కిసలాట ఘటన చాలా బాధాకరం. తప్పు ఎవరి వల్ల జరిగినా మనస్పూర్తిగా నేను క్షమాపణలు చెప్పాను. టిటిడి ఇఒ, ఎఇఒ, చైర్మన్‌, బోర్డు సభ్యులు ప్రెస్‌మీట్‌ పెట్టి క్షమాపణ చెప్పి తీరాలి. నాకు లేని నామోషీ మీకు ఎందుకు? తప్పు లేదంటే ఎలా?” అంటూ డిప్యూటీ సిఎం పవన్‌ కళ్యాణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో శుక్రవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పిఠాపురంలోని రాజీవ్‌ గాంధీ మున్సిపల్‌ హైస్కూల్‌ ఆవరణలో నిర్వహించిన పల్లె పండుగ వారోత్సవ సభలో పవన్‌ మాట్లాడారు. అధికారులు జాగ్రత్తలు తీసుకుని ఉంటే తిరుపతిలో తొక్కిసలాట ఘటన జరిగేది కాదన్నారు. క్షతగాత్రులు చెప్పిన మాటలతో తాను చలించుకుపోయానని, అందుకే తాను క్షమాపణ చెప్పానని తెలిపారు. సంక్రాంతి ముందు ఇటువంటి ఘటన జరగడం బాధాకరమన్నారు. ఎవరైనా సరే రాజ్యాంగానికి కట్టుబడి పని చేయాల్సిందేనని, తప్పు చేస్తే ఎవర్నీ క్షమించకూడదని అన్నారు.

పిఠాపురానికి జాతీయ స్థాయిలో పేరు తీసుకొస్తా

పిఠాపురం ప్రజలు తనను ఎంతో ఆదరించారని, అందుకు తగ్గట్టుగా నియోజకవర్గానికి జాతీయ స్థాయిలో పేరు వచ్చేలా అభివృద్ధి చేస్తానని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. స్థానికంగా తనకున్న స్థలంలోనే షెడ్లు వేసుకుని ఉంటానని, ప్రతి గ్రామానికీ వెళ్లి స్వయంగా ప్రతి ఒక్కరినీ కలుస్తానని తెలిపారు. తనకు పిఠాపురం నుంచి చాలా ఫిర్యాదులు వచ్చాయని, పోలీసులు ఉదాసీనంగా ఉన్నారన్నారు. రథాలపేట, ఇందిరానగర్‌, అగ్రహా రాల్లో గంజాయి వాడకం పెరిగిందనే ఫిర్యాదుల నేపథ్యంలో పోలీసులు దృష్టి పెట్టాలని ఎస్‌పికి సూచించారు. ఈవ్‌టీజింగ్‌ను సహించేదన్నారు.

6 నెలల్లోనే 12,500 మినీ గోకులం షెడ్ల నిర్మాణం

ఆరు నెలల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా 12,500 మినీ గోకులం షెడ్లను నిర్మించామని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కుమారపురంలో రూ.1.85 లక్షల ఉపాధి నిధులతో నిర్మించిన మినీ గోకులాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. గోకులం షెడ్లలో ఏర్పాటు చేస్తున్న మౌలిక వసతులను పశుసంవర్ధక శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పాడి రైతులకు అందిస్తున్న సదుపాయాలపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ది శాఖ, ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో పిఠాపురం నియోజకవర్గం పరిధిలో ఇప్పటి వరకు పూర్తి చేసిన అభివృద్ధి పనుల వివరాలతో కూడిన పోస్టర్‌ను పరిశీలించారు. అనంతరం పల్లెపండుగ వారోత్సవాల్లో పాల్గొన్నారు.

➡️