జనసేన శాసనసభాపక్ష నేతగా పవన్‌కళ్యాణ్‌

ప్ర్రజాశక్తి – అమరావతి బ్యూరో :జనసేన శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ అధ్యక్షులు పవన్‌కల్యాణ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తొలుత తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్‌ పవన్‌కల్యాణ్‌ పేరును ప్రతిపాదించగా, సభ్యులందరూ ఏకగ్రీవంగా బలపరిచారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో మంగళవారం జనసేన తరపున గెలిచిన ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్‌ మాట్లాడుతూ ప్రజలందించిన ఈ ఘన విజయం కక్ష సాధింపు రాజకీయాల కోసం కాదని, పగ, ప్రతీకారాలు తీర్చుకోవడానికి అంతకంటే కానే కాదన్నారు. ప్రజలు జనసేన పార్టీని నమ్మి పెద్ద బాధ్యతను అప్పజెప్పారని, వారి నమ్మకానికి తగ్గస్థాయిలో సేవచేయాలన్నారు. తనతో పాటు గెలిచిన ఎమ్మెల్యేలంతా దానిని బాధ్యతగా తీసుకుందామన్నారు. ప్రణాళికాబద్ధంగా నియోజకవర్గాల్లో ప్రాధాన్యతా అంశాలను గుర్తించాలని, ఏయే అంశాలు మొదటి ప్రాధాన్యత అంశాల్లో తెలుసుకోవాలని పవన్‌కల్యాణ్‌ సూచించారు. ఒక వేళ కేంద్రంతో ముడిపడిన అంశాలుంటే కేంద్ర ప్రభుత్వంలోని పెద్దల దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించుకుందామన్నారు. ఈ ఎన్నికల్లో విద్య, వైద్యం, ఉపాధి, భద్రత, సాగు, తాగు, నీరు కల్పిస్తామని ప్రజలకు పూర్తి స్థాయిలో హామీనిచ్చామని, అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో హామీలను పరిష్కరించేందుకు ఎమ్మెల్యేలందరూ కృషి చేయాలన్నారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు సహేతుకంగా ఉండాలని, వ్యక్తిగతంగా ఎవరూ మాట్లాడవద్దని పవన్‌కల్యాణ్‌ పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ మాట్లాడుతూ చారిత్రిక విజయం అందుకుని మొదటి శాసనసభాపక్షం సమావేశం జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. పవన్‌కల్యాణ్‌ చిత్తశుద్ది, రాష్ట్రం కోసం తపించిన విధానం మనల్ని గెలిపించాయన్నారు.

➡️