- సంక్రాంతికి మొదటి దశ పనులు పూర్తి శ్రీ పల్లె పండుగ
- పంచాయతీ వారోత్సవాల్లో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
ప్రజాశక్తి- కృష్ణాప్రతినిధి : రాష్ట్రంలో టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపడు తోందని, పనులు పారదర్శకంగా నిర్వహించేందు కు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. కృష్ణాజిల్లా కంకిపాడు మండలంలో రూ. 91 లక్షల విలువైన పనులకు శంకుస్థాపన చేసి ‘పల్లె పండుగ- పంచాయతీ వారోత్సవాలు’ కార్యక్రమాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పవన్ మాట్లాడుతూ… జాతీయ ఉపాధి హామీ చట్టం… ప్రజలకు ఉపాధి కల్పించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి దోహదపడుతోంద న్నారు. ఈ చట్టంలోని మెటీరియల్ కాంపోనెంట్ నిధులు రూ.4500 కోట్లతో పంచాయతీల్లో రహదారులు, డ్రయిన్లు, 30 వేల పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఆగస్టు 23న గ్రామ సభల ద్వారానే ఈ పనులకు తీర్మానం చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజులపాటు ఈ పనుల శంకుస్థాపన కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో ప్రణాళికా బద్ధంగా పనిచేసి మొదటి దశ పనులను సంక్రాంతి పండుగ నాటికి పూర్తి చేయాలన్నారు. కాకినాడలో అటవీశాఖ అధికారి తన పేరు ఉపయోగించుకుని చేస్తున్న పనులు తమ దృష్టికి వచ్చిందన్నారు. మోడీతో మాట్లాడి కోనసీమ- మచిలీపట్నం రేపల్లే రైల్వే లైనును సాధిస్తానని చెప్పారు. ఉపాధి, అభివృద్ధి తర్వాతే వినోదానికి ప్రాధాన్యత ఉంటుందని, అభిమానులు గుర్తించాలని కోరారు. ఈ సందర్భంగా మూడు వేల కిలోమీటర్ల సీసీ రోడ్ల నిర్మాణం, 500 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 25 వేల గోకులాల నిర్మాణం, పది వేల ఎకరాల్లో నీటి సంరక్షణ కందకాల తవ్వకం పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని పవన్ కల్యాణ్ ఆవిష్కరించారు. కంకిపాడు పరిధిలో ఎన్‌ఆర్‌జిఎస్ కింద రూ.95.15 లక్షల అంచనా వ్యయంతో 11 అంతర్గత సీసీ రోడ్లు, రెండు మినీ గోకులాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపి బాలశౌరి, మంత్రి కొల్లు రవీంద్ర, పెనమలూరు, గుడివాడ, పెడన, పామర్రు ఎమ్మెల్యేలు బోడే ప్రసాద్, వెనిగండ్ల రాము, కాగిత కృష్ణప్రసాద్, వర్ల కుమార్‌రాజా, ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్‌కుమార్, జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ తదితరులు పాల్గొన్నారు.