- సిఎంకు వి శ్రీనివాసరావు లేఖ
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి ఎసిసి కృష్ణా సిమెంటు ఫ్యాక్టరీ లాకౌట్ అయి 32 సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులకు పరిహారం అందలేదని, దానిని వెంటనే చెల్లించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి విశ్రీనివాసరావు కోరారు. ఈమేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఆయన శనివారం లేఖ రాశారు. 1993 మే 29న ఎసిసి సిమెంటు ఫ్యాక్టరీని అక్రమ లాకౌట్ చేశారని ఈ లేఖలో ఆయన తెలిపారు. అప్పట్లో చేసిన పనికి ఇప్పటికీ కార్మికులకు జీతాలు ఇవ్వలేదని పేర్కొన్నారుఏ. 333 మంది కార్మికుల్లో ఇప్పటి వరకూ 160 మంది చనిపోయారని, కార్మికుల కుటుంబాలు దీనావస్థలో ఉన్నాయని తెలిపారు. సిమెంటు కంపెనీ ఆస్తులను బాల భాను ఎంటర్‌ప్రైజెస్, ఎన్‌ఆర్‌ఐ నామినల్ రేట్లకు దక్కించుకున్నారని తెలిపారు. అదే సమయంలో బకాయిలు చెల్లించాలన్న వేలం కండిషన్‌ను ఇతవరకు అమలు చేయలేదని, దానిని అమలు చేయాలని కోరారు. గతంలో ఫ్యాక్టరీ భూములను పదికోట్లకు కొన్నారని, నేడు రెండువేల కోట్లకుపైగా విలువ చేస్తున్నాయని తెలిపారు. కార్మికులకు చెల్లించాల్సిన బకాయి మొత్తం రూ.43 కోట్లు ఇప్పటికీ చెల్లించలేదని వివరించారు. ఈ నియోజకర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న లోకేష్ ఎన్నికల ముందు కార్మికులకు న్యాయం చేస్తానని హామీనిచ్చారని గుర్తుచేశారు. కార్మికుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సమస్యను పరిష్కరించి, న్యాయం చేయాలని కోరారు. నష్టపరిహారం చెల్లించని పక్షంలో భూములను కార్మికుల పరం చేయాలని డిమాండు చేశారు. లేదావేలం పాడుకున్న కంపెనీ నుండి ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నష్టపరిహారం చెల్లించాలని కోరారు.