ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : దేశంలో ఇప్పుడు బిజెపి రాజ్యాంగం అమలవుతోందని పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. ప్రాధమిక హక్కులకు విలువ లేదన్నారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకూ ఎఐసిసి పిలుపుమేరకు మంగళవారం ‘కానిస్టిట్యూషన్ మార్చ్’ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజ్యాంగానికి ప్రమాదం రాకుండా కాంగ్రెస్ పోరాడుతుందని చెప్పారు. సెక్యులరిజం స్ఫూర్తిని బిజెపి దెబ్బతీస్తోందని, మతాల మధ్య మంటలు రేపుతుందని అన్నారు. మణిపూర్ లాంటి రాష్ట్రాల్లో ప్రజల ఊచకోతలే ఇందుకు నిదర్శనమని చెప్పారు. ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీలను మనుషులుగా చూడటం లేదన్నారు. దేశంలోని అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే కులగణన జరగాలని తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ కొనుగోలులో ముడుపులపై ఎటువంటి విచారణ లేకపోవడానికి బిజెపినే కారణమని చెప్పారు. అదానీని బిజెపినే కాపాడుతుందన్నారు. వైసిపి ఎమ్మెల్యేలు రాజ్యాంగాన్ని గౌరవించడం లేదని, ఎమ్మెల్యేలు చట్ట సభకు వెళ్లాలని రాజ్యాంగం చెబుతున్నా వారు వెళ్లడం లేదని అన్నారు. సెకి నుంచి విద్యుత్ కొనుగోళ్లలో ముడుపుల విషయంలో అన్ని సాక్ష్యాలు ఉన్నాయని అమెరికా సంస్థ ఎఫ్‌బిఐ చెప్పినా, చంద్రబాబు దర్యాప్తు చేయించడం లేదన్నారు. వెంటనే విచారణ కమిటీని వేయాలని డిమాండ్ చేశారు.
ఖర్గేతో పిసిసి మాజీ చీఫ్ గిడుగు భేటీ
ఎఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేను ఢిల్లీలోని ఆయన నివాసంలో ఎపిసిసి మాజీ అధ్యక్షులు, సిడబ్ల్యుసి సభ్యులు గిడుగు రుద్రరాజు మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలతోపాటు పార్టీ పరిస్థితులను ఖర్గే అడిగి తెలుసుకున్నారు. ఖర్గే సూచనలకు అనుగుణంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తానని గిడుగు తెలిపారు.