- బలపరిచిన ప్రజా సంఘాలు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కృష్ణా-గుంటూరు శాసనమండలి పిడిఎఫ్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు పోటీ చేయనున్నారు. ఆయన అభ్యర్థిత్వాన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ, అధ్యాపక, పెన్షనర్లు, ప్రజా సంఘాలు బలపరిచాయి. తూర్పు-పశ్చిమగోదావరి పిడిఎఫ్ ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ వి బాలసుబ్రమణ్యం విజయవాడలోని ఎంబి విజ్ఞాన కేంద్రంలో బుధవారం జరిగిన సదస్సులో లక్ష్మణరావు అభ్యర్థిత్వాన్ని ప్రకటించారుఈ సందర్భంగా ఐ వెంకటేశ్వరరావు, వి బాలసుబ్రమణ్యం, కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ.. 2007 శాసనమండలి పునరుద్ధరణ నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయ, అధ్యాపక, కార్మిక ప్రజల హక్కులను కాపాడేందుకు అత్యంత నిజాయతీగా, నిబద్ధతతో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను ప్రజల ముందుకు తీసుకొచ్చామని చెప్పారు. చుక్కా రామయ్య, ప్రొఫెసర్ నాగేశ్వరరావు, వి బాలసుబ్రమణ్యంతో పాటు వివిధ రంగాల్లో నిష్ణాతులైన 13 మంది పిడిఎఫ్ తరపున ఎమ్మెల్సీలుగా పనిచేశారని వెల్లడించారు. శాసనమండలి వేదికగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, అంగన్‌వాడీ, విద్యార్థుల తరపున శాసనమండలిలో గళమెత్తడంతో పాటు మండలి వెలుపల వారి ఉద్యమాలకు మద్దతు తెలిపామని పేర్కొన్నారు. రాజ్యాంగంలో ఉన్న ప్రమాణాలను శాసనమండలిలో తాము పాటించామని చెప్పారు. ప్రజల పక్షాన, ప్రజల కోసం పనిచేస్తూ ఎలాంటి సొంత లాభం లేకుండా పనిచేస్తున్న పిడిఎఫ్ అభ్యర్థులను ఎమ్మెల్సీలుగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. పట్టభద్రులందరూ తమ ఓట్లను నమోదు చేసుకుని లక్ష్మణరావుకు మద్దతు పలకాలని పిలుపునిచ్చారు. రాజకీయాలకు అతీతంగా మేధావుల ఎన్నికలుగా పట్టభద్రుల ఎన్నికలు జరగాలని ఆశించారు. యుటిఎఫ్ అధ్యక్షులు ఎన్ వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో యుటిఎఫ్ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ఎస్ ప్రసాద్, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె సుబ్బరావమ్మ, ఆవాజ్ కార్యదర్శి శిష్టి, జనవిజ్ఞాన వేదిక నాయకులు కె శ్రీనివాస్, ఆలిండియా లాయర్స్ అసోసియేషన్ నాయకులు వెంకట్రావు, మెడికల్ రిప్రజెంట్ అసోసియేషన్ నాయకులు కృష్ణయ్య, ఎస్‌టిఇఎ నాయకులు ప్రభాకర్ వారి సంఘాల తరపున మద్దతు తెలుపుతున్నట్లు వెల్లడించారు. నవంబరు 6వ తేదీలోపు ఓటర్లుగా నమోదు చేసుకుని లక్ష్మణరావుకు మద్దతు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ సహాధ్యక్షులు ఎఎన్ కుసుమ కుమారి, కార్యదర్శి ఎస్‌పి మనోహర్ కుమార్, కెఎ ఉమామహేశ్వరరావు, టిఎస్‌ఎల్‌ఎన్ మల్లేశ్వరరావు, ఎన్ కుమార్ రాజా, ఎం హనుమంతరావు, లయోల మాజీ ప్రిన్సిపల్ రామరాజు తదితరులు పాల్గొన్నారు.