ప్రజాశక్తి -పెనుకొండ టౌన్ : ప్రభుత్వ విద్యా రంగాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని పిడిఎఫ్ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం పెనుకొండ పట్టణంలోని మౌర్య రెసిడెన్సీలో యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్ ఆధ్వర్యంలో పెనుకొండ డివిజన్ కార్యవర్గ సమావేశంలో ఎమ్మెల్సీ వెంకటేశ్వర రావు ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. గత ప్రభుత్వం అమలు పరిచిన 117 జీవో ఫలితంగా విద్యారంగం అస్తవ్యస్తంగా, గందరగోళంగా మారిందన్నారు. టిడిపి కూటమి ప్రభుత్వం విద్యా రంగాన్ని వెంటనే సరిదిద్దాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం కూడా ఉపాధ్యాయులను బోధనకు పరిమితం చేయకుండా, బోధనా సమయాన్ని యాప్‌ల పనిభారంతో, ఆన్‌లైన్ వర్క్‌తో వృథా చేస్తున్నారన్నారు. 3,4,5, ప్రాథమిక పాఠశాలలో కొనసాగాలని అందుకోసం రెండు రకాల పాఠశాలలను 1 నుంచి 5, 6 నుంచి 10 వరకూ ఉండేలా కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యారంగా పరిరక్షణ కోసం యుటిఎఫ్ ఎంతో పోరాటం చేసిందని, ప్రభుత్వ బడులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడు నెలలు కావస్తున్నా ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆర్థిక పరమైన విషయంలో ఎటువంటి పురోగతి లేదన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు దాదాపు 25 వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సింది ఉందని తెలిపారు. సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ గౌరవాధ్యక్షులు భూతన్న, జిల్లా కార్యదర్శి ఈ.నారాయణ స్వామి, జిల్లా మహిళా కమిటీ కన్వీనర్ హసీనా బేగం, కష్ణ నాయక్, జి.రమేష్, రవీంద్రనాథ్, ఎంకె.నబీ, ఉపేంద్ర, మారుతీ, నరసింహుడు, రామాంజినేయులు, వెంకటా నాయక్, సునీత, నాగమణి, రాధా మణి తదితరులు పాల్గొన్నారు.
