పెండింగ్‌ ఫీజు రీయింబర్స్‌ వెంటనే విడుదల చేయాలి

Mar 13,2025 11:46 #Dharna, #SFI, #sfi dharna, #vijayanagaram
  • విద్యారంగంలో ఉన్న సమస్యలు పరిష్కరించాలి
  • ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్‌
  • ఆర్టీసి కాంప్లెక్స్‌ వద్ద రాస్తారోకో

ప్రజాశక్తి- విజయనగరం టౌన్‌ : విద్యారంగ సమస్యల పరిష్కారం చేయాలని, ఫీజు రీయింబర్స్మెంట్‌ నిధులు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ విజయనగరం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం స్థానిక ఆర్టీసి కాంప్లెక్స్‌ వద్ద రాస్తారోకో చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.రామ్మోహన్‌, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డి.రాము, సిహెచ్‌ వెంకటేష్‌లు మాట్లాడుతూ.. విద్యరంగా సమస్యలు పరిష్కారం కోసం ఈ నెల 15న విజయవాడ నగరంలో నిరసన దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. గతంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకత్వం ఛలో విజయవాడ నిర్వహించే క్రమంలో ప్రభుత్వం చర్చలకు పిలిచి నెల రోజుల్లో సమస్యలు పరిష్కారం చేస్తామని మాట ఇచ్చారని గుర్తు చేశారు. కానీ 3 నెలను గడుస్తున్న ఇప్పటి వరకు సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. 5వేల కోట్లు ఫీజు రీయింబర్స్‌ బకాయిలను చెల్లిస్తామని హామీ ఇచ్చారని, జీవో నెంబర్‌ 77 రద్దు చేస్తామని ఇలా అనేక హామీలు ఇచ్చి ఇప్పటివరకు స్పందించక పోవడం దారుణమన్నారు. కళాశాలకు విద్యార్థులను ఫీజుల కోసం ఒత్తిడి చేస్తున్నాయని, అప్పు చేసి ఫీజులు కట్టవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 15 తేదీన విజయవాడలో జరిగే నిరసన దీక్షకు మద్దతుగా ఈ రోజు కార్యక్రమ చేపట్టడం జరిగిందన్నారు. ప్రభుత్వం విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేయడంలో చిత్తశుద్ధితో లేదని విమర్శించారు. గత రెండు సంవత్సరాలుగా ఫీజు రీయింబర్స్‌ ఇవ్వకపోవడంతో విద్యార్థులపై ఫీజుల భారం పడుతుందని, ఫీజులు కట్టలేక అనేక మంది చదువుకు దూరం అవుతున్నారన్నారు. జీవో నెంబర్‌ 77 రద్దు చేస్తామని హామీని నిలబెట్టుకోవాలని, ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ప్రైవేటీకరణ చేయోదని, వెటర్నరీ విద్యార్థులకు 25 వేల స్టైఫండ్‌ ఇవ్వాలని, పీజీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ రద్దు చేసి యూనివర్సిటీ పరిధిలో నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ఎస్‌ఎఫ్‌ఎ ఈనెల 15 తేదీన విజయవాడ ధర్నా చౌక్‌లో నిరసన దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో విద్యార్థులతో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు రవి, జగదీష్‌, రాజు విద్యార్దులు పాల్గొన్నారు.

➡️