- ఉక్కు కాంట్రాక్టు కార్మికుల ధర్నా
ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : కాంట్రాక్టు కార్మికుల పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్టీల్‌ప్లాంట్ కాంట్రాక్టు లేబర్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో మంగళవారం భారీ ధర్నా జరిగింది. తొలుత స్టీల్‌ప్లాంట్ మెయిన్ గేటు ప్రధాన రహదారిపై వేలాది మంది కార్మికులు నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం స్టీల్‌ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ వద్ద ఆందోళన కొనసాగించారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి యాజమాన్యం చిత్తశుద్ధితో కృషి చేయాలని, కర్మాగారానికి ప్రభుత్వం సరిపడా ముడిసరుకు, నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకూ ఆలస్యంగా చెల్లిస్తూ వస్తున్న జీతాలను సకాలంలోనే చెల్లించాలని నినదించారు. ప్రతి నెలా ఏడో తేదీ లోపు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇఎస్‌ఐ లేని కార్మికులకు స్టీల్‌ప్లాంట్ యాజమాన్యమే వైద్య సదుపాయాలు కల్పించాలని కోరారు. ఎన్‌జెసిఎస్‌లో పెంచిన రూ.1200ను వెంటనే కార్మికులకు చెల్లించాలని, ఉక్కు నిర్వాసితులకు శాశ్వత ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్.నర్సింగరావు మాట్లాడుతూ.. స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణలో భాగంగా కార్మికులపై చేస్తున్న కుట్రలను తిప్పికొట్టడానికి అందరూ ఐక్య పోరాటాలకు సిద్ధంగా ఉండాలన్నారు. కాంట్రాక్టు కార్మికులను తగ్గించాలనే ప్రతిపాదనను వెంటనే ఉక్కు యాజమాన్యం విరమించుకోవాలని, లేకుంటే ఈ పోరాటం మరింత ఉగ్రరూపం దాలుస్తుందని హెచ్చరించారు. స్టీల్‌ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ (సిఐటియు) గౌరవాధ్యక్షులు జె.అయోధ్యరామ్, ప్రధాన కార్యదర్శి యు.రామస్వామి మాట్లాడుతూ… స్టీల్‌ప్లాంట్‌కు సకాలంలో ముడిసరుకు రాకుండా అడ్డుకుంటూ కర్మాగారాన్ని నష్టాల్లోకి నెట్టాలని కేంద్రం చూస్తోందన్నారు. సొంత గనులు కేటాయించి, ముడి సరుకును సకాలంలో అందించేలా చేస్తే లాభాల పంట పండించడానికి కార్మికులు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. లక్షలాది మందికి ఉపాధి కల్పించే అవకాశం స్టీల్‌ప్లాంట్‌లో ఉన్నప్పటికీ ప్రయివేటీకరణ చేసి కార్పొరేట్ శక్తులకు కట్టబెడదామన్న దుర్మార్గపు ఆలోచనలతో చేస్తున్న కుట్రలను మానుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో స్టీల్‌ప్లాంట్ కాంట్రాక్టు లేబర్ యూనియన్ అధ్యక్షులు జి.శ్రీనివాసరావు, సిఐటియు జిల్లా అధ్యక్షులు కెఎం.శ్రీనివాసరావు, నాయకులు నమ్మి రమణ, వివి.రమణ. బి.కన్నబాబు, యు.సోమేష్, పి.మసేను, శశిభూషణ్. ఒవి.రావు. కె.సత్యవతి పాల్గొన్నారు.