- డిస్కంల సిఎమ్‌డిలతో మంత్రి గొట్టిపాటి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విద్యుత్ పంపిణీ సంస్థల్లో పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులకు ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీం (ఆర్‌డిఎస్‌ఎస్), పిఎం సూర్యఘర్ పనుల పురోగతిపై డిస్కంల సిఎమ్‌డిలతో సచివాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు. ఆర్‌డిఎస్‌ఎస్ పనులను వేగవంతం చేయాలని మంత్రి చెప్పారు. సూర్యఘర్‌పై క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించి పునరుత్పాదక విద్యుదుత్పత్తి వైపు వారిని ప్రోత్సహించాలని చెప్పారు. రైతులకు అవసరమైన వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడానికి అధికారులు సిద్ధంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. దరఖాస్తుదారుల్లో అర్హులైన వారికి వ్యవసాయ సీజన్ కనెక్షన్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వినియోగదారులకు నిరంతరం విద్యుత్ సరఫరాను అందించాలని చెప్పారు. అప్రకటిత కోతలు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర సమయాల్లో విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగితే స్థానిక ప్రజలకు ముందస్తు సందేశం అందేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో ఎపిసిపిడిసిఎల్ సిఎమ్‌డి పుల్లారెడ్డి హాజరవ్వగా, వర్చువల్‌గా ఎపిఇపిడిసిఎల్ సిఎమ్‌డి ఐ పృథ్వీతేజ్, ఎపిఎస్‌పిడిసిఎల్ సిఎమ్‌డి కె సంతోషరావు హాజరయ్యారు.