జగన్‌ బినామీలకు పింఛను డబ్బులు – మాజీ మంత్రి దేవినేని ఉమా

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ఎన్నికల కోడ్‌ అమల్లో ఉందని తెలిసీ ఖజానాలో పెన్షన్‌ డబ్బులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన బినామీలకు దోచిపెట్టారని మాజీ మంత్రి, టిడిపి నేత దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. అడ్డగోలు నిర్ణయాలు తీసుకుని రూ.వేల కోట్లు అస్మదీయులకు, వైసిపిలోని కొందరి నేతలకు ఊడ్చిపెట్టారని పేర్కొన్నారు. టిడిపి కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సోమవారం తెల్లవారుజామున పెన్షన్‌ ఇవ్వకపోతే ప్రజల తరపున ఉద్యమిస్తామని హెచ్చరించారు. పెన్షన్‌ అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరారు.
జగన్‌ స్వార్ధ రాజకీయాల వల్లే పెన్షన్ల పంపిణీ బాధ్యత నుంచి వలంటీర్లను ఎన్నికల కమిషన్‌ తప్పించిందని టిడిపి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ ఒక ప్రకటనలో విమర్శించారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనలు తుంగలో తొక్కి వలంటీర్లను రాజకీయ ప్రచారం కోసం ఉపయోగించారని అన్నారు. వలంటీర్లు లేకపోతే గెలవననే భయంతో సిఎం జగన్‌ నీచ రాజకీయాలు చేస్తున్నారని, వారిని పార్టీ కార్యకర్తల్లా వాడుకుంటున్నారని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య విమర్శించారు. ప్రజాసేవ మాత్రమే చేసే వలంటీర్లను తమ ప్రభుత్వం ఏర్పడగానే కొనసాగిస్తామని టిడిపి జాతీయ అధికార ప్రతినిధి గురజాల మాల్యాద్రి అన్నారు.

➡️