సోషల్‌ మీడియా ద్వారా ప్రజలను ప్రగతిశీల భావాల వైపు నడిపించాలి

  • కేశవరెడ్డి స్మారక స్టూడియో ప్రారంభంలో వక్తలు

ప్రజాశక్తి – విజయవాడ అర్బన్‌ : సోషల్‌ మీడియా ప్రజాతంత్ర వేదికగా శక్తివంతంగా మారుతోందని, దీని ద్వారా ప్రజలను ప్రగతిశీల భావాల వైపు నడిపించాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. రాజ్యాంగ దినోత్సవం, కేశవరెడ్డి వర్ధంతి సందర్భంగా సోషల్‌ మీడియా ఫర్‌ సొసైటీ అధ్వర్యాన విజయవాడలోని బాలోత్సవ్‌ భవన్‌లో మంగళవారం సాయంత్రం కొమ్మారెడ్డి కేశవరెడ్డి స్మారక స్టూడియోను అల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సుంకర రాజేంద్రప్రసాద్‌ మంగళవారం ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. సోషల్‌ మీడియా ద్వారా సమాచారం వేగంగా వెళ్తోందని తెలిపారు. అయితే, ఇది పురోగమనంగా వెళ్తుందా? తిరోగమనం వైపు వెళ్తుందా? అన్నది చూడాలన్నారు. ఎక్కువగా తిరోగమనం వైపు పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద స్థాయిలో అబద్ధాలు, అసత్యాలు ప్రచారంలోకి వెళుతున్నాయని తెలిపారు. శాస్త్రీయ దృక్పథంతో పురోగమనంవైపు సమాచారం వెళ్లే విధంగా చూడాలన్నారు. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. సోషల్‌ మీడియా అంటే వివిధ పార్టీల నాయకులు తిట్టుకునే వేదిక కాదని, సమాజం కోసం ఆలోచించే వారికి చక్కని మార్గదర్శకంగా ఉండాలని సూచించారు. రానున్న తరానికి చక్కటి విలువలు బోధించే విధంగా సోషల్‌ మీడియా వేదికగా ఉండాలని తెలిపారు. సభకు అధ్యక్షత వహించిన ప్రజాశక్తి సంపాదకులు బి.తులసీదాస్‌ మాట్లాడుతూ.. ఈ స్టూడియో కేశవరెడ్డి కుటుంబ సభ్యుల ఆర్థిక సహకారంతో రూపుదిద్దుకుందన్నారు.
రానున్న కాలంలో మరింతగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. సాంకేతికపరంగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. సోషల్‌ మీడియా ఫర్‌ సొసైటీ పర్యవేక్షణలో అభ్యుదయ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా స్టూడియో పని చేస్తుందని తెలిపారు. కేశవరెడ్డి ఉపాధ్యాయుడిగా ఎంతో మంది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దారని, ఎన్నో పుస్తకాలను అనువదించారని తెలిపారు. కేశవరెడ్డి అనువాదాలు సామాన్యులకు సైతం అర్థమయ్యే విధంగా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్‌ శర్మ, కేశవరెడ్డి కుటుంబ సభ్యులు డి.ఆంజనేయరెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఎంబివికె కార్యక్రమాల బాధ్యులు యు. వి.రామరాజు తదితరులు పాల్గొన్నారు.

➡️