రైతాంగ సమస్యలు పరిష్కరించకుంటే టిడిపి కూటమికి జనం సున్నం రాస్తారు

ధర్నాలో మాజీ ఎంపి పి మధు హెచ్చరిక
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రైతులకు పెట్టుబడి సాయం రూ.20 వేలు ఇస్తామని ఎన్నికల సమయంలో టిడిపి, జనసేన, బిజెపి కూటమి నాయకులు హామీ ఇచ్చారని, ఇంతవరకు అమలు చేయలేదని, ఖరీఫ్‌ ముగిసి, రబీ సగం కాలం గడిచినా రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, ఇదే పద్ధతి కొనసాగితే టిడిపి కూటమి ప్రభుత్వానికి జనం సున్నం రాస్తారని మాజీ ఎంపి పి మధు హెచ్చరించారు. రైతులను మోసం చేయాలని చూస్తే ఉద్యమం తీవ్రం చేస్తామని ప్రకటించారు. రైతాంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం ఆధ్వర్యాన శుక్రవారం ధర్నా చౌక్‌లో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎంపి పి మధు మాట్లాడుతూ.. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన పెట్టుబడి సాయం.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఊసే లేకుండా పోయిందని అన్నారు. 2047 నాటికి ఏమి చేస్తామనే అంశంపై ఊదరగొడుతున్నారని, కానీ రూ.100 కోట్లు, రూ.150 కోట్లు ఖర్చు పెడితే పూర్తయ్యే ఇరిగేషన్‌ ప్రాజెక్టుల ప్రస్తావన చేయడం లేదని విమర్శించారు. టిడిపి, జనసేన, బిజెపి కూటమి ప్రభుత్వం చేస్తున్నదేమీ లేదని, అమరావతి, పోలవరం పేరుచెప్పి కాలం వెళ్లదీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వస్తే వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్‌ కనెక్షన్‌ ఇస్తామని చెప్పారని, ఆచరణలో డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు. రైతుల ఆత్మహత్యలను నివారిస్తామని ప్రకటించారని, ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గానీ, ప్రస్తుతం సిఎం చంద్రబాబు నాయుడు గానీ రైతులకు చేసిందేమీ లేదన్నారు. రైతులకు పెట్టుబడి సాయం సాధన కోసం ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకరరెడ్డి మాట్లాడుతూ.. రాయలసీమ ప్రాంతంలో కరువు మండలాలు ప్రకటించినా ఇప్పటికీ అక్కడి రైతులకు న్యాయం చేయలేదని, ఇన్‌పుట్‌ సబ్సిడీ కూడా ఇవ్వడం లేదని అన్నారు. సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి రైతులకు తీవ్ర నష్టదాయకమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం సీనియర్‌ నాయకులు వై కేశవరావు మాట్లాడుతూ.. కేంద్రం.. రైతుల పట్ల పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రైతు వ్యతిరేక చట్టాలను అమలు చేసేందుకు పూనుకుంటోందని తెలిపారు. ఇప్పటికే రైతు నేత దల్లేవాల్‌ 52 రోజులుగా ఆందోళన చేస్తున్నారని, సమస్యలపై చర్చించి రైతులకు న్యాయం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించినా కేంద్రం పట్టించుకోవడం లేదని అన్నారు. దల్లేవాల్‌కు ఏమైనా జరిగితే దానికి కేంద్రమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఎపి కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం హరిబాబు మాట్లాడుతూ.. కౌలురైతులకు నష్టం కలిగించే చట్టాన్ని మార్చాలని ఎన్నిసార్లు కోరినా మార్చడం లేదన్నారు. ప్రభుత్వాలు మారుతున్నా కౌలు రైతులకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు రైతులకు న్యాయం చేస్తామని ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపడతామని హెచ్చరించారు. పాల రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి కుంచుమాటి అజరు మాట్లాడుతూ.. పాడి, వ్యవసాయం రెండూ రైతులను ఆదుకునేవని, ప్రభుత్వాలు మాత్రం వాటిని ఆదుకోవడం లేదని అన్నారు. పసుపు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి జన్నా శివశంకర్‌ మాట్లాడుతూ.. పసుపు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందాయన్నారు. చెరకు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి సూర్యనారాయణ మాట్లాడుతూ.. రైతులకు దిగుబడిని పెంచే చెరకు వంగడాలు ఇవ్వడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని తెలిపారు. మామిడి రైతుల సంఘం రాష్ట్ర నాయకులు పివి ఆంజనేయులు మాట్లాడుతూ.. మామిడి ఎగుమతుల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం న్యాయసమ్మతంగా లేదని, రైతులకు నష్టం కలిగించేలా ఉందని తెలిపారు. చేపల రైతుల సంఘం నాయకులు బలరామ్‌, కొబ్బరి రైతుల సంఘం నాయకులు శ్రీనివాస్‌, పండ్ల తోటల రైతుల సంఘం నాయకులు శివారెడ్డి, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు హేమలత, రాష్ట్ర కమిటీ సభ్యులు భారతి తదితరులు ప్రసంగించారు. సభకు అధ్యక్షత వహించిన వి కృష్ణయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో లిఫ్టు ఇరిగేషన్ల కింద సాగు పెద్దయెత్తున ఉన్నా.. వాటిని ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని, దెబ్బతిని పోతున్నాయని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి నీటిని ఎత్తిపోసే లిఫ్టులను బాగు చేయించాలని కోరారు.

➡️