కేంద్ర బడ్జెట్‌ సవరణ లేకుండా ఆమోదం పొందితే రాష్ట్రానికి శాశ్వత నష్టం

  • ప్రత్యేక హోదా సాధన సమితి

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌ను జిల్లాగా, పోలవరంను డెడ్‌ స్టోరేజి ప్రాజెక్టుగా పేర్కొన్నారని, వాటిని సవరించకుండా ఆమోదం తెలిపితే రాష్ట్రానికి శాశ్వత నష్టం కలుగుతుదని ప్రత్యేక హౌదా, విభజన హామీల సాధన సమితి పేర్కొంది. వాటిని తక్షణం సవరించాలని డిమాండ్‌ చేసింది. గురువారం బాలోత్సవ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రత్యేక హౌదా సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్‌, సిపిఎం మాజీ ఎంపి పి.మధు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, ఎపి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య, కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి తదితరులు ఈ మేరకు ఎంపిలకు రాసిన లేఖను మీడియాకు విడుదల చేశారు. తాము సూచించిన సవరణలు చేయడం ద్వారా రాష్ట్రానికి ఉపయోగం ఉంటుందని, దీనిపై సిఎం జోక్యం చేసుకుని సవరణకు పట్టుబట్టాలని కోరారు. ముఖ్యంగా ఎపిని జిల్లాగా, పోలవరం ప్రాజెక్టును డెడ్‌ స్టోరేజీ ప్రాజెక్టుగా కేంద్ర బడ్జెట్లో పేర్కొన్న పదజాలాన్ని సవరించాలని కోరారు. దీనిపై ముఖ్యమంత్రితో పాటు కేంద్ర పెద్దల వద్ద పలుకుబడి ఉందని చెబుతున్న పవన్‌కల్యాణ్‌ జోక్యం చేసుకుని పదజాలాన్ని సవరించేలా చూడాలని, అత్యంత కీలక విషయంగా దీన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ప్రత్యేక హౌదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాసరావు మాట్లాడుతూ పోలవరం నిధుల కేటాయింపు, వెనుకబడిన జిల్లాలకు నిధులు వంటి అంశాల్లో ఎక్కడా రాష్ట్రానికి న్యాయం చేయలేదని చెప్పారు. . 2017 నాటి అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు రూ.57,297 కోట్లు పైబడి ఖర్చు అవుతుందని, కానీ కేంద్రం విద్యుత్‌ పార్టును మినహాయించి రూ.55,548 కోట్లకు ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. 11 సంవత్సరాల్లో ఎపి పెట్టిన ఖర్చు తీసేస్తే రూ.19,500 కోట్లు మాత్రమే కేంద్రం ఇచ్చిందని వివరించారు. 2025 ఎస్‌ఎస్‌ఆర్‌ రేట్ల ప్రకారం మిగిలిన పనుల ఖర్చు రూ.50 వేల కోట్లు ఉంటుందని వివరించారు. దీనిలోనూ ఎక్కువ భాగం పునరావాసం కోసం అవుతుందని తెలిపారు. 2023లో రూ.12,500 కోట్లతోపాటు మరికొంత మాత్రమే ఇస్తామని చెప్పిందని, దానికి రాష్ట్రం ఒప్పుకోలేదని వార్తలూ వచ్చాయని చెప్పారు. 135 అడుగుల ఎత్తు కాంటూర్‌కే పునరావాస ప్యాకేజీ ఇస్తే కొండలపైనున్న వారికి రవాణా సదుపాయం లేకుండా పోతుందని, నాగరిక సమాజంలో ఇంతకంటే అన్యాయం మరొకటి లేదని తెలిపారు. ప్రస్తుతం ప్రతిపాదించిన రూ.8000 కోట్లుగాక ఇంకా రూ.35 వేల కోట్ల నుండి రూ.40 వేల కోట్ల వరకూ ఖర్చవుతుందని తెలిపారు. బడ్జెట్లో పేర్కొన్న విధంగా పరిమితం చేస్తే ప్రపంచంలో బహుళార్థక సాధక ప్రాజెక్టుల్లో డెడ్‌ స్టోరేజీ లేదా అంతకంటే తక్కువకు పరిమితం చేసిన ప్రాజెక్టు ఇదొక్కటే అవుతుందని పేర్కొన్నారు. రైల్వే బడ్జెట్‌ విషయంలోనూ మోసం జరిగిందని పేర్కొన్నారు. సిపిఎం మాజీ ఎంపి పి.మధు మాట్లాడుతూ పోలవరం పునరావాసం విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రజలను మోసం చేస్తున్నాయని తెలిపారు. అమరావతికి నిధుల కేటాయింపు విషయంలోనూ అదే నాటకం ఆడుతున్నాయని వివరించారు. విదేశీ బ్యాంకుల నుండి రుణాలు తెచ్చుకోవాలంటే కేంద్రం సంతకం చేస్తుందని, దానికే తాము నిధులు ఇచ్చినట్లు చెప్పి రాష్ట్రంలో బిజెపి నాయకులు, కేంద్ర మంత్రి అమిత్‌షా, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సిఎం పవన్‌కల్యాణ్‌ ప్రజలను మోసం చేశారని అన్నారు. వారిచ్చిన షరతులు అమోదిస్తేనే నిధులు విడుదల చేస్తామని రాష్ట్రం ఒప్పుకుందని, ఇది రాష్ట్ర ప్రజలకు తలవంపులు తప్ప మరొకటి కాదని అన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ 150 అడుగుల ఎత్తు కట్టాల్సిన పోలవరం ప్రాజెక్టును 135 అడుగులకు తగ్గిస్తే తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలిపారు. వెనుకబడిన ప్రాంతాలకు, రాయలసీమ జిల్లాలకు ఇవ్వాల్సిన ప్యాకేజీని పక్కనబెట్టేశారని అన్నారు. విభజన చట్టం ప్రకారం రాయలసీమ ఉత్తరాంధ్రకు కెబికె, బుందేల్‌ఖండ్‌ తరహాలో దాదాపు పదిన్నర సంతవ్సరాల క్రితమే రూ.24,350 కోట్లు నిధులు రావాల్సి ఉందని తెలిపారు. గతంలో ప్రతి జిల్లాకు రూ.50 కోట్లు నిధులు విదిల్చి చేతులు దులుపుకుందని విమర్శించారు. విశాఖపట్నం స్టీలు ప్లాంటును కూడా అమ్మేసే కుట్ర సాగుతోందని అన్నారు. ఈ అంశాలకు సంబంధించి రాష్ట్ర ఎంపిలకు, అలాగే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న పరిమళ్‌ నత్వానికి కూడా లేఖ రాసినట్లు తెలిపారు. ఎంపిలకు పంపిన లేఖలో చలసాని శ్రీనివాస్‌, వి.శ్రీనివాసరావు, కె.రామకృష్ణ, వి.వి.లక్ష్మీనారాయణతోపాటు, పలువురు ప్రతినిధులు సంతకాలు చేశారు. విలేకరుల సమావేశంలో సాధన సమితి కార్యదర్శి టి.నరసింహారావు కూడా పాల్గొన్నారు.

➡️