ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విజయవాడలో బుడమేరు వరదలకు శాశ్వత పరిష్కారం చూపేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. విజయవాడలోని జలవనరులశాఖ కార్యాలయంలో బుడమేరుపై యాక్షన్ ప్లాన్ కోసం జలవనరులశాఖ, టౌన్‌ప్లానింగ్, రెవెన్యూ, సర్వే అధికారులతో గురువారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతి పదేళ్లకోసారి బుడమేరు వరదలతో విజయవాడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విజయవాడను ముంపు రహిత నగరంగా మార్చేందుకు అంతా కలిసికట్టుగా పనిచేయాలని ఆదేశించారు. బుడమేరు వాగు వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ నుండి పాత ఛానల్, విజయవాడ నగరం, గుడివాడ నుండి, కొల్లేరు దాకా వుందన్నారు. వెలగలేరు, కవులూరు, ఈలప్రోలు, పైడురుపాడు, గొల్లపూడి మీద నుండి విద్యాధరపురం, విజయవాడలోని 14, 15, 16 వార్డుల్లో, గుణదల, రామవరప్పాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు వరకు మొత్తంగా 13.25 కిలోమీటర్లు వరకు బుడమేరు ఆక్రమణలు జరిగాయన్నారు. ఇందులో ఎక్కువ వ్యవసాయ ఆక్రమణలుగా గుర్తించామన్నారు. విధ్యాధరపురం నుండి గుణదల వరకు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే 202 ఎకరాలకు గానూ 70 ఎకరాలు ఆక్రమణకు గురి కాగా, ఇందులో 3,051 ఇళ్ల నిర్మాణాలు వున్నట్లు గుర్తించామని తెలిపారు. ఇలా బుడమేరు విస్తరణ ఎంత, ఆక్రమణలు ఎంత అనేది ముఖ్యమంత్రికి నివేదిస్తామన్నారు. అలాగే చీమలవాగు, కేసరపల్లి, ఎనికేపాడు యుటిల సామర్థ్యం పెంచాల్సిన అవసరం వుందన్నారు. ఎనికేపాడు నుండి కొల్లేరు వరకు వెళ్లే 50.6 కిలోమీటర్ల కాలువ గట్లను మరింత బలోపేతం చేయడం, ఈ గట్టును ఎంతమేర, ఎక్కడెక్కడ బలోపేతం చేయాలి, లైనింగ్, విస్తరణ పనులు ఎంతమేర చేయాలో కార్యాచరణ రూపొందించాలని కోరారు. బుడమేరు పాత ఛానల్ అంతా నగరంలోని ఇళ్ల మధ్య నుండి ప్రవహిస్తోందని, దీనికి సమాంతరంగా వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ నుండి పాముల కాలువ, ముస్తాబాద్ కెనాల్ మీదుగా ఎనికేపాడు వరకు కెనాల్‌ను తవ్వడం ద్వారా బుడమేరుకు వచ్చే వరద నీటిని మళ్లించే అవకాశం వుంటుందని తెలిపారు. అందువల్ల పాముల కాలువ, ముస్తాబాద్ కాలువలు ఇరిగేషన్ పరంగా ఎంత వరకు విస్తరణ చేయవచ్చో పరిశీలించాలని కోరారు. యాక్షన్ ప్లాన్‌ను తయారు చేసుకుని ముఖ్యమంత్రి ముందు వుంచుతామని తెలిపారు. ముఖ్యమంత్రి గ్రీన్ సిగల్ ఇవ్వగానే పనులు మొదలుపెడతామన్నారు.
