డిఎస్‌సిలో పిఇటి ఖాళీలు భర్తీ చేయాలి -సిఎంకు వి. శ్రీనివాసరావు లేఖ

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో 25 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ 2024 డిఎస్‌సిలో కేవలం 6,100 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇచ్చిందని, అందులోనూ వ్యాయామ ఉపాధ్యాయులకు స్థానం కల్పించలేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు. ఈ డిఎస్‌సిలో వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులనూ భర్తీ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి శనివారం లేఖ రాశారు. తమ సమస్యలను వ్యాయామ ఉపాధ్యాయులు పలు దఫాలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారని గుర్తు చేశారు. అలాగే శనివారం తనను కలిశారని, సమస్యలు వివరించారని పేర్కొన్నారు. విద్యాహక్కు చట్టంలో భాగంగా ప్రైమరీ, అప్పర్‌ ప్రైమరీ పాఠశాలలు డిఎస్‌సి (పిఇటి) ద్వారా పోస్టులు భర్తీ చేయాలని కోరుతున్నారని, అది న్యాయసమ్మతమైందని సిఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో వ్యాయామ ఉపాధ్యాయ నిరుద్యోగులు 80 వేల మంది ఉన్నారని, ‘ఆడుదాం – ఆంధ్రా’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ఆటల పోటీలు నిర్వహించిందని, నిరుద్యోగులందరికీ డిఎస్‌సి ద్వారా ఉద్యోగాలు ఇస్తే స్కూళ్లలో విద్యార్థులెంతమందో క్రీడాకారులుగా తయారయ్యే అవకాశముందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమమూ జయప్రదమవుతుందని వివరించారు. లేని యెడల ‘ఆడుదాం – ఆంధ్రా’ ఆర్భాటంగానే మిగిలిపోతుందని వివరించారు. ఈ అంశాన్ని ప్రత్యేకంగా పరిశీలించి డిఎస్‌సిలో వ్యాయమ ఉపాధ్యాయుల పోస్టులు ప్రకటించి, భర్తీచేయాలని కోరారు.

➡️