పరిహారం చెల్లించకుండానే పెట్రో పైప్‌లైన్‌ పనులు

– అడ్డుకున్న సిపిఎం నేతలు
– అరెస్ట్‌, విడుదల
ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బిపిసిఎల్‌) సంస్థ చేపట్టిన పెట్రో పైప్‌లైన్‌ పనులను సిపిఎం నేతలు అడ్డుకున్నారు. కృష్ణపట్నం పోర్టు నుంచి హైదరాబాద్‌ సమీపంలోని మాధవరం వరకు రూ.1962 కోట్లతో బిపిసిఎల్‌ భారీ పెట్రో పైప్‌లైన్‌ ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా ఇందుకూరుపేట మండలంలో కొందరు రైతులకు పరిహారం చెల్లించకుండా ఆ సంస్థ సిబ్బంది శుక్రవారం పైప్‌లైన్‌ పనులు చేపట్టింది. పైప్‌లైన్‌ పనులను బాధిత రైతులతో కలిసి సిపిఎం జిల్లా నాయకులు టివివి ప్రసాద్‌తోపాటు పలువురు నేతలు అడ్డుకున్నారు. నష్టపరిహారం చెల్లించిన తర్వాతే పనులు ప్రారంభించాలని పట్టుబట్టారు. అప్పటి వరకు పనులు చేపట్టవద్దంటూ అక్కడే భీష్మించారు. సంస్థ సిబ్బంది వెంటనే వెళ్లిపోవాలని డిమాండ్‌ చేశారు. దీంతో అధికారులు పనులు నిలిపివేశారు. ఆందోళన చేస్తున్న సిపిఎం నాయకులు, రైతులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి ఇందుకూరుపేట పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం వారిని విడుదల చేశారు. అక్రమ అరెస్టులను సిపిఎం, సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు తీవ్రంగా ఖండించారు.

➡️