పల్నాడులో బాంబుల కలకలం

May 17,2024 08:08 #Houses, #Petrol bombs, #YCP Leaders
  •  హైదరాబాద్‌కు జెసి కుటుంబ సభ్యులు
  •  గృహ నిర్బంధంలో మంత్రి ఆనంద్‌బాబు, జంగా

ప్రజాశక్తి- యంత్రాంగం : సార్వత్రిక ఎన్నికల అనంతరం అనంతపురం జిల్లా తాడిపత్రి, పల్నాడు జిల్లా మాచర్ల, తిరుపతిలో చోటుచేసుకున్న ఘర్షణలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పల్నాడు జిల్లాలోని పలు గ్రామాల్లో 19 కంపెనీల సిఆర్‌పిఎఫ్‌ బలగాలు మకాం వేశాయి. ఈనెల 12 నుంచి 14 వరకు జరిగిన ఘర్షణలలో నిందితులను గుర్తించే పనిలో పోలీసు యంత్రాంగం నిమగమైంది. ఘర్షణలకు బాధ్యుడిగా గుర్తిస్తూ కారంపూడి సర్పంచ్‌ రామావత్‌ తేజానాయక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కౌంటింగ్‌ పూర్తయ్యే వరకూ తిరుపతి సిటీలో 144 సెక్షన్‌ కొనసాగుతుందని ఎన్నికల అధికారి తెలిపారు. తాడిపత్రిలో జెసి కుటుంబసభ్యులందరినీ హైదరాబాద్‌కు తరలించారు. పల్నాడులో మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు, జంగా కృష్ణమూర్తిని గృహ నిర్బంధంలో ఉంచారు.
పల్నాడు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లి, ముప్పాళ్ల మండలం మాదల గ్రామాల్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. టిడిపి, వైసిపి నేతల ఇళ్లను క్షుణంగా తనిఖీ చేశారు. తనిఖీల్లో 50 నాటు, పెట్రోలు బాంబులు వేటకొడవళ్ళు, గొడ్డళ్లు స్వాధీనం చేసుకున్నారు. పెట్రోల్‌ బాంబులు తయారు చేసే వ్యక్తిని, ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే మాదలలో 29 పెట్రోలు బాంబులను స్వాధీనం చేసుకున్నామని పల్నాడు జిల్లా ఎస్‌పి బిందుమాధవ్‌ తెలిపారు. అల్లర్లు జరిగిన ప్రాంతాలను పరిశీలించేందుకు వెళ్తున్న మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు, జంగా కృష్ణమూర్తిని గుంటూరులో పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. జిల్లాలో టిడిపి, వైసిపి అభ్యర్థుల కదలికలపై పోలీసులు నిఘా వుంచారు. జిల్లాలో 144 సెక్షన్‌ నేపథ్యంలో మాచర్ల, పిడుగురాళ్ల, గురజాల, నర్సరావుపేట తదితర ప్రాంతాల్లో వ్యాపార కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. వందమందికిపైన కేసు నమోదు చేశామని, 22 మందిని రిమాండ్‌కు తరలించామని, 200 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని ఎస్‌పి బిందుమాధవ్‌ మీడియాకు తెలిపారు.
తాడిపత్రిలో ఇరు పార్టీలకు చెందిన దాదాపు 91 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఉరవకొండ మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరు పరచగా వారందరికీ కౌంటింగ్‌ ముగిసేంత వరకు రిమాండ్‌ విధించారు. పలువురు ముఖ్యనేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని పక్క జిల్లాలకు తరలించారు. జెసి ప్రభాకర్‌రెడ్డి ఇంట్లో పనిచేస్తున్న పని మనుషులను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న జెసి.దివాకర్‌రెడ్డి తనయుడు పవన్‌ కుమార్‌రెడ్డి హైదరాబాద్‌ నుంచి తాడిపత్రికి వచ్చారు. తాడిపత్రిలో ఉండడానికి వీలు లేదని జెసి కుటుంబ సభ్యులందరినీ హైదరాబాద్‌కు తరలించారు. తాడిపత్రిలో పరిస్థితి అదుపులోకి వచ్చేంత వరకు 144 సెక్షన్‌ కొనసాగుతుందని పోలీసులు తెలియజేశారు.
తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. రెండు బెటాలియన్లను గురువారం నగరానికి రప్పించారు. యూనివర్సిటీ సమీపంలో దుకాణాలు, షాపులను మూసివేయించారు. గంగమ్మ జాతర నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, ఘర్షణలు చోటు చేసుకోకుండా నిఘాను పెంచారు. 144 సెక్షన్‌ అమలులో ఉన్న నేపథ్యంలో ప్రజలెవ్వరూ గుంపులు, గుంపులుగా బయటకు రావద్దని క్యాన్వాస్‌ నిర్వహించారు.

➡️