- కమిషనర్లకు అనుమతి ఇచ్చిన ఆర్థిక శాఖ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రప్రభుత్వం మున్సిపల్ ఉపాధ్యాయులకు పిఎఫ్ ఖాతాలు ప్రారంభించేందుకు అనుమతి ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ఆర్ధిక శాఖ ఇటీవల విడుదల చేసింది. పిడి ఖాతాలు ప్రారంభించాలని మున్సిపల్ కమిషనర్లకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఖాతాలకు వడ్డీ చెల్లిస్తుందా? లేదా? అనే స్పష్టత ఇవ్వలేదు. ఈ అంశంపై స్పష్టత ఇవ్వాల్సి ఉంది. మున్సిపల్ ఉపాధ్యాయులకు ఇప్పటి వరకు పిఎఫ్ ఖాతాలు లేవు. వీటిని ప్రారంభించాలని ఏళ్లతరబడి కోరుతున్నారు. మున్సిపల్ ఉపాధ్యాయుల సర్వీస్‌ను విద్యాశాఖలో కలుపుతూ 2022 జూన్‌లో ప్రభుత్వం 84వ నెంబర్ జిఓను విడుదల చేసింది. ఆ సమయంలో ప్రభుత్వ, జిల్లా పరిషత్ ఉపాధ్యాయులకు ఉండే సౌకర్యాలు కల్పిస్తామని విద్యాశాఖ హామీ ఇచ్చింది. దీంతో ఏళ్ల తరబడి ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్నారు. మున్సిపల్ ఉపాధ్యాయుల పిఎఫ్‌పై కదలిక రావడం పట్ల యుటిఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్ వెంకటేశ్వర్లు, కెఎస్‌ఎస్ ప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఉపాధ్యాయులను విద్యాశాఖలో విలీనం చేసే సమయంలో పిఎఫ్, బదిలీలు, ప్రమోషన్లు, అప్‌గ్రేడేషన్ చేస్తామని విద్యాశాఖ హామీ ఇచ్చిందని తెలిపారు. వీటికోసం దశల వారీగా పిడిఎఫ్, యుటిఎఫ్ పోరాటం చేశాయని, ఫలితంగా ఉపాధ్యాయుల ప్రమోషన్ షెడ్యూల్ ఇప్పటికే వచ్చిందని తెలిపారు. భవిష్యత్తులో ఉపాధ్యాయుల వ్యక్తిగత ఖాతాలు తెరిచేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికైనా పిఎఫ్‌పై కదలిక తీసుకొచ్చిన విద్య, ఆర్థిక, మున్సిపల్ శాఖల ఉన్నతాధికారులకు అభినందనలు తెలిపారు. మున్సిపల్ ఉపాధ్యాయుల పిఎఫ్ ఖాతాల అనుమతిపై ఎపిటిఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సివి ప్రసాద్, రాధాకృష్ణ హర్షం వ్యక్తం చేశారు.