నేడు ఛలో విజయవాడకు పీహెచ్‌సీ వైద్యుల సంఘం పిలుపు..

హైదరాబాద్‌: పీజీ వైద్య విద్యలో ఇన్‌ సర్వీస్‌ కోటాను రాష్ట్ర ప్రభుత్వం కుదించిన దానికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్‌సీ) డాక్టర్లు వైద్య సేవ­లను ఆపేశారు. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అత్యవసర సేవలు మినహా ఇతర వైద్య సేవలన్నింటికి దూరంగా ఉంటూ పీహెచ్‌సీ డాక్టర్లు సమ్మె చేస్తున్నారు. చర్చలకని పిలిచిన రాష్ట్ర సర్కార్‌ తమను తీవ్ర అవమానానికి గురి చేసిందని పీహెచ్‌సీ వైద్యు­ల సంఘం తెలిపింది. ప్రభుత్వానికి స్పెషలిస్ట్‌ వైద్యుల అవ­సరం లేదు.. ప్రభుత్వాస్పత్రుల్లో కంటే ప్రైవేట్‌ ఆస్ప­త్రుల్లోనే మెరుగైన వైద్యం అందిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
పీహెచ్‌సీ వైద్యులు చేపట్టిన సమ్మెకు ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం మద్దతు తెలుపుతున్నట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ జయధీర్‌ తెలిపారు. ఏపీ ఎన్‌జీవో, స్టాఫ్‌ నర్స్‌, సీహెచ్వో, ఎంఎల్‌హెచ్‌పీ సంఘాలు కూడా ఈ నిరసనకు సపోర్ట్‌ ఇచ్చాయి. నిరవధిక నిరాహార దీక్షలో పాల్గంటామని పీహెచ్‌సీ వైద్యులు స్పష్టం చేశారు. పీజీ వైద్య విద్యలో ఇన్‌సర్వీస్‌ కోటా కుదింపు నిర్ణయం దళిత, గిరిజన, బలహీన వర్గాలకు వైద్య సేవలపై తీవ్ర ప్రభావం చూపుతుందని వెల్లడించారు. గ్రామీణ, గిరిజన ప్రజలకు అత్యున్నత వైద్య సేవలు అందాలనే లక్ష్యంతో ఇన్‌సర్వీస్‌ కోటాను తెచ్చినట్టు వారు గుర్తు చేశారు.

➡️