మహిళల్లో చైతన్యం తీసుకొచ్చిన ‘ఫూలే’

Apr 11,2025 20:51 #Minister Kollu Ravindra

 జయంతి వేడుకల్లో మంత్రి కొల్లు రవీంద్ర
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మహిళల్లో చైతన్యం తీసుకొచ్చిన వ్యక్తి జ్యోతిరావు ఫూలే అని ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఫూలే జయంతి వేడుకలు టిడిపి కార్యాలయంలో శుక్రవారం జరిగాయి. ఈ సందర్భంగా ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి మంత్రి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై మొట్టమొదటిగా గళమెత్తిన వ్యక్తి ఫూలే అని తెలిపారు. విద్య ద్వారానే సమాజంలో అసమానతలను తొలగించవచ్చని ఫూలే భావించి కొంతమందికే పరిమితమైన విద్యను అందరికీ అందించాలనే లక్ష్యంతో అనేకమందిని చైతన్యపరిచారని పేర్కొన్నారు. స్వాతంత్య్ర పోరాట సమయంలో మహాత్మా గాంధీ, బిఆర్‌ అంబేద్కర్‌ వంటి అనేక మంది సంఘ సంస్కర్తలు ఫూలే ఆలోచన విధానాన్ని ప్రసంశించారని తెలిపారు. మాజీ ఎమ్మెల్సీలు జంగా కృష్ణమూర్తి, పి అశోక్‌బాబు మాట్లాడారు.

టిటిడి ప్రతిష్టను దిగజార్చేందుకు కుట్రలు : బుచ్చి రాంప్రసాద్‌
తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ప్రతిష్టను దిగజార్చేందుకు వైసిపి నేతలు ప్రయత్నిస్తున్నారని టిడిపి బ్రాహ్మణ సాధికార సమతి కన్వీనర్‌ బుచ్చిరాంప్రసాద్‌ విమర్శించారు. టిడిపి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుపతి తొక్కిసలాటకు కారణమైన హరినాథ్‌ రెడ్డిని కాపాడాలని వైసిపి నేత భూమన కరుణాకర్‌రెడ్డి కుట్రలకు తెరలేపారని పేర్కొన్నారు. పొనమనూరు నుంచి వచ్చిన ఒక్క ఆవు మాత్రమే అనారోగ్యంతో మృత్యువాత పడినట్లు తెలిపారు.

➡️